– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
Netflix, Disney Hotstar తో పాటు ఇతర ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌పై కంట్రోలింగ్ ఉండాలని, ఈ స్ట్రీమింగ్ సేవలకు ప్రభుత్వ అనుమతి ఉండాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓటీటీల్లో వచ్చే వల్గర్ కంటెంట్‌ని ఆన్‌లైన్‌లో చూపించే ముందు దీనిపై స్వతంత్రంగా సమీక్షించ జరగాలని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ సూచించినట్టు తెలుస్తోంది. జూన్ 20న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందింది. OTT ప్లాట్‌ఫారమ్‌లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
కాగా, మంత్రిత్వ శాఖ “OTT ప్లాట్‌ఫారమ్‌లపై అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌కు సంబంధించిన ఆందోళనలను హైలైట్ చేసింది. పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున కంప్లెయింట్స్ అందుతున్నట్టు ఓ వార్త సంస్థ నివేదించింది. ఇక.. అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేయడంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. 2027 నాటికి ఈ రంగంలో 7 బిలియన్ల (700 కోట్ల) మార్కెట్‌గా ఎదగనుందని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ కంటెంట్‌తో సహా స్ట్రీమింగ్ కంటెంట్, నీతి నియమావళి అని పిలుచుకునే విధంగా ఉండేలా చూసేందుకు మరింత చురుకైన విధానం ఉండాలని ప్రభుత్వం తెలియజేసింది. హింసను ప్రేరేపించేలా, మతపరమైన కారణాలతో కానీ, సున్నితంగా ఉండే కంటెంట్‌పై జాగ్రత్త వహించాలని ఓటీటీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. కాగా, ఈ భేటీకి Amazon, Disney, Netflix, Reliance, Viacom18, Apple వంటి ఓటీటీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.