ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కరోనా కారణంగా ఏపీలో మరణించిన వారి కుటుంబాలకు గవర్నర్ సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మళ్లీ కోవిడ్ ఉధృతి పెరిగిందని గవర్నర్ గుర్తుచేశారు. సెకండ్ వేవ్ కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇటువంటి సమయంలో కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆయన సెల్యూట్ చేశారు.
ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చామని, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్‌ను తెప్పించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 50 శాతం బెడ్లు కేటాయించామన్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా అందుబాటులోకి తెస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. కరోనాతో ఏపీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినా సంక్షేమ పథకాలు మాత్రం నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నట్లు గవర్నర్ తెలిపారు.