Saturday, September 21, 2024

Spl Story: లీడర్​ లేని కాంగ్రెస్​ పార్టీ, గుడ్​బై చెబుతున్న సీనియర్లు.. కేడర్​లో ఆందోళన!

కాంగ్రెస్​ పార్టీ నుంచి సీనియర్​ లీడర్లంతా వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న కపిల్ సిబల్, అశ్వనీ కుమార్ పార్టీని వీడడం కాంగ్రెస్‌ను కుదిపేసింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ సీనియర్ ​మోస్ట్​ లీడర్​, అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడు అయిన గులాంనబీ ఆజాద్​ పార్టీకి గుడ్​ బై చెప్పడమూ కలవరం రేపుతోంది. ఇక దేశంలో కాంగ్రెస్​ పార్టీ రోజు రోజుకూ తన వైభవాన్ని కోల్పోతోంది. పార్టీని ముందుండి నడిపించే లీడర్​షిప్​ లేకపోవడమే దీనికంతటికీ కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాహుల్​ గాంధీవి పిల్ల చేష్టలన్న విమర్శలు చేస్తున్నారు.. ఆయన తీరుతో చాలామంది పార్టీ లీడర్లు మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కాంగ్రెస్​ పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకువస్తున్న వారంతా ఇప్పుడు ‘‘చీ.. పో..’’ అంటూ చీదరించుకుంటున్నారు. దీనికి కారణాలేంటన్నది మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచించడం లేదు. పైగా పార్టీకి లీడర్​షిప్​ లేకపోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారిందని చాలామంది లీడర్లు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పరిశీలిస్తే.. ఇక్కడ పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​పై స్థానిక నేతలతో పడడం లేదు. అతని వ్యవహార ధోరణితో తాము పడలేకపోతున్నామని, తమకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో దాసోజు శ్రవణ్​ విపరీత విమర్శలు గుప్పించారు. ఇక.. నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి సైతం తనకు, పార్టీ స్టేట్​ చీఫ్​ రేవంత్​రెడ్డికి పడడం లేదని, ఎవరినో తీసుకొచ్చి (టీడీపీ నుంచి) తమపై పెత్తనం చెలాయించేలా అధికారం కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. చాలాకాలం వెయిట్​చేసిన అతను ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరారు.

ఇక.. కేరళ రాష్ట్రంలోనూ ఇట్లాంటి తగాదాలే ఉన్నాయి. సీనియర్​ లీడర్ల తీరు చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పార్టీ వ్యవహార ధోరణి నచ్చక పార్టీలో ఉంటూనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కేరళలోని కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో చాలామందిని హైకమాండ్​ ఢిల్లీకి పిలిపించి మందలించింది. కొంతమందిని తాత్కాలికంగా సస్పెండ్​ చేసింది.

కాగా, తాజాగా గులాం నబీ ఆజాద్​ ఆ పార్టీని వీడారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని, జమ్ము, కాశ్మీర్​లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక ఆయనకు మద్దతుగా జమ్ము, కాశ్మీర్​ నుంచి చాలామంది సపోర్ట్​గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్​ పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ గాంధీ నాశనం చేశారని ఆరోపిస్తూ గులాం నబీ ఆజాద్​కు సంఘీభావంగా ఐదుగురు జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.

- Advertisement -

గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు గులాం మహ్మద్ సరూరి, హాజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, చౌదరి అక్రమ్ మహ్మద్, సల్మాన్ నిజామీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గులాం నబీ ఆజాద్ సంస్థాగత ఎన్నికలకు ముందు ఇవ్వాల (శుక్రవారం) పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం అంతర్గత ఎన్నికల పేరుతో పార్టీని మోసం చేసిందని.. వారి బూటకపు ఆలోచనలతో పార్టీ నాశనం అవుతోందని ఆరోపించారు.

తన లెటర్‌లో రాహుల్ గాంధీని పేర్కొన్న ఆజాద్ “రిమోట్ కంట్రోల్ మోడల్” కాంగ్రెస్ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిందని, ఇట్లాంటి చెత్త నిర్ణయాలు రాహుల్ గాంధీనే కాదు.. సెక్యూరిటీ గార్డులు, అతని పీఏలు కూడా తీసుకుంటారని ఆరోపించారు. సీనియర్లు, అనుభవం ఉన్న నేతలందరినీ పక్కనబెట్టి అనుభవం లేని దళారులకు ప్రయారిటీ ఇస్తున్నారని, ఇట్లాంటి కొత్త కోటరీ పార్టీ వ్యవహారాలను నడిపించడం ప్రారంభించిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement