హైదరాబాద్, ఆంధ్రప్రభ: శీతాకాంలో అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్‌హాట్‌గా సాగనున్నాయి. తెలంగాణ సంక్షేమ పథకాలు, కేంద్ర వివక్ష ఎజెండాగా హీట్‌ను పెంచనున్నాయి. కేంద్ర ఆర్ధిక ఆంక్షలతో జరిగిన నష్టాన్ని ప్రధానంగా హైలెట్ చేయడంతోపాటు, దేశ రాజకీయాల్లో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల రికార్డులు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర ప్రజల సంక్షేమమే అజెండాగా, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో యావత్ దేశమే ఆశ్చర్యపోయే పథకాలను ప్రవేశపెట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలకు పదునుపెట్టి మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కార్యాచరణను ఎంచుకుంది.
రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబాకర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తదితర పథకాలకు లక్ష్యాలను నిర్దేశించి లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు మొదలుపెట్టింది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ పథకాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనిచేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయా, లేదా అనే అంశంపై సీఎం కేసీఆర్ ప్రతీ సందర్భంలోనూ ఆరా తీశారు. ఇక దళితబంధు, రూ. 3 లక్షలు ఇంటికి ఆర్ధిక సాయం పథకం అమలులోనూ సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ దిశలోనే గ్రామ గ్రామాన సర్వేలు నిర్వహించి పథకాల అమలు, ప్రజాభిప్రాయంపై నివేదికలు తెప్పించుకున్నారు. అక్కడక్కడ ప్రభుత్వ పథకాలు దారి మళ్ళుతున్న అంశాలను, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటి దిద్దుబాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞనాన్ని వందశాతం సద్వినియోగం చేసుకుంటూ ప్రతి పథకంలోనూ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, అవకతవకలకు వీలు లేని విధంగా, ప్రజలు అధికారులతో కలిసి లంచాలకు అవకాశం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం లేకుండా పథకాల ద్వారా పొందే లబ్ధిని నేరుగా బ్యాంకు అకౌంట్లో జమచేసే వ్యవస్థను పలు పథకాల్లో ఆవిష్కరించారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల్లో మరింత పారదర్శకత పెంచి మిగిలిన ఉన్న లబ్ధిదారులందరినీ గుర్తించి న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. మిషన్ భగీరథతో ఉచితంగా ఇంటింటికి రక్షిత తాగునీటికి, ఇతర పథకాలకు సమయుగ్ర కుటుంబ సర్వే ఫలితాలను అమలు చేశారు. అదే సర్వే ఫలితంగా ఆసరా పెన్షన్లు, రైతుబీమా పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను కాకుండా భవిష్యత్ తరాల కోసం, సామాజిక భద్రత కోసం తాపత్రయ పడుతున్న ప్రజాకాంక్షను గుర్తించి ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించే కార్యక్రమం దాదాపు 70 శాతం పూర్తయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం ఏడాది కాలంలోనే 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. సామాజిక భద్రతకు పెద్ద పీట…
పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి అణగారిన వర్గాల ఆదరాభిమానాలు చూరగొన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2016కు పెంచారు. వికలాంగులకు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రతినెలా రూ.3 వేల పెన్షన్ అందిస్తూ దారిద్య్ర రేఖకు దిగువనున్న లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఇదే తరహా పేదరికంతో మగ్గుతున్న అనేక రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శంగా మారింది. ఇప్పటి వరకు దాదాపు 16 రాష్ట్రాలు సామాజిక భద్రత పెన్షన్లపై ప్రత్యేక బృందాలతో అధ్యయనం చేయించాయి. వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు మొదటి విడత పాలనలో రూ.1000 చొప్పున పెన్షన్లు ఇస్తుండగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని రూ.2వేలకు పెంచారు. అలాగే వృద్ధ కళాకారులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి తెలంగాణ ఉద్యమం నాటి వారి ఆకాంక్షను నెరవేర్చారు. ఇమామ్, మౌజన్లకు ప్రతినెలా ఇస్తున్న పారితోషకాన్ని రూ.1,500 నుంచి రూ.5వేలకు ఊహించని విధంగా పెంచారు.
పెరిగిన లబ్ధిదారులు…
సీఎం కేసీఆర్ మలి విడత ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాల్లోనూ లబ్ధిదారుల సంఖ్య 10 నుంచి 25 శాతం వరకు పెరిగింది. రైతుబంధు పథకంలో 48 లక్షల నుంచి 56 లక్షలకు లబ్ధిదారులు పెరిగారు. రైతుబీమా పథకం చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు భవిష్య నిధిగా మారిన నేపథ్యంలో కమతాల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఒక గుంట భూమి ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేసి ప్రభుత్వం ఉదార స్వభావంతో అమలు చేస్తున్నందున చిన్న కమతాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పది ఎకరాలకు పైబడి వ్యవసాయ భూములున్న రైతులంతా తమ కుటుంబ సభ్యుల పేర్లతో విభజించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. దీంతో గత ఏడాది వరకు 58 లక్షలుగా ఉన్న రైతుబీమా లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 62 లక్షలు దాటింది. అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్న వయో వృద్ధుల సంఖ్య దాదాపు 14 లక్షలు ఉండగా, ఈ ఏడాది మరో లక్ష పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వికలాంగ పెన్షన్ లబ్దిదారులు 5 లక్షలు ఉండగా, అక్కడక్కడ మిగిలి ఉన్న అర్హులను గుర్తించగా, మరో 50వేల మంది అదనంగా ఈ జాబితాలో చేరారు. వితంతు పెన్షన్ పొందుతున్న లబ్దిదారుల సంఖ్య కూడా 14.50 లక్షలు ఉండగా, మరో 60వేల మంది అదనంగా చేరినట్లు లెక్కలున్నాయి.
అగ్రవర్ణాల పేదలకూ కళ్యాణలక్ష్మి….
దళిత, గిరిజన మైనారిటీ, వెనకబడిన తరగతుల కుటుంబాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను వర్తింపజేసి ఆ మొత్తాన్ని రూ.75వేల నుంచి రూ.లక్షా 16వేలకు పెంచి సీఎం కేసీఆర్ రికార్డు సృష్టించారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచు ఈ పథకానికి అర్హత పొందినట్లేనని ప్రకటిస్తూ నిబంధనలను సరళతరం చేశారు. మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వ ఖర్చులతో పెళ్ళిళ్ళు నిర్వహించి దేశానికే ఆదర్శమైన పాలనను ఆవిష్కరించారు.
సాంకేతిక వ్యవస్థతో అక్రమాలకు అడ్డుకట్ట…
రైతుబంధు, పెన్షన్ పథకాల తర్వాత రాష్ట్రంలో అత్యధిక కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్న పథకం ఇంటింటికీ రేషన్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ పొందేవిధంగా వెసులుబాటు కల్పిస్తూ ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 86 లక్షల కుటుంబాలకు దాదాపు 17వేలు దాటిన చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను సరసమైన ధరలకు సరఫరా చేస్తున్నారు. దీనిద్వారా దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించినట్లయింది. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ధర రూపాయికే కిలో బియ్యాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు.
కుటుంబంలో ఆరుగురికి మాత్రమే రేషన్ ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసి పరిమితి లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతినెలా దాదాపు రూ. 160 కోట్లు ఖర్చుచేస్తూ పేద కుటుంబాలకు రేషన్ సరఫరా చేయడంలో పారదర్శక వ్యవస్థను ఆవిష్కరించారు. లబ్ధిదారుల పేరుతో సరుకులు నల్లబజారుకు తరలకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వంలో వృధా వ్యయాన్ని దాదాపు తగ్గించారు. అలాగే అన్ని పథకాల్లోనూ నిజమైన లబ్ధిదారుకే నిధులు చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.