హైదరాబాద్ సిటీలో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులపై అన్ని వర్గాల నుంచి అద్భుతమైన సానుకూల స్పందన వస్తోందని, ఆయా కార్యక్రమాల ద్వారా నగర పౌరులకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు సంబంధిత ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎస్.ఆర్ డిపి సంబంధిత కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసేందుకు వీలుగా ఇప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఉపయోగపడుతాయని మంత్రి చెప్పారు.
మిస్సింగ్ లింకు రోడ్ల అభివృద్ధి తర్వాత అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపైన ట్రాఫిక్ తగ్గిందని, ఈ కార్యక్రమం వలన అనేక నూతన ప్రాంతాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులపై సైతం మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలం సీజన్‌కి సంబంధించి ఇప్పటి నుంచే అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని, స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ , జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.