వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): సీపీఆర్ ప్రక్రియతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన హోంగార్డును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇవ్వాల (సోమవారం) ఘనంగా సత్కరించారు. నిన్న (ఆదివారం) వరంగల్‌లోని కాపువాడకు చెందిన రేషన్ డీలర్ రాజు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ములుగు జంక్షన్ వద్ద గుండెపోటు వచ్చింది. ఛాతీ పట్టుకోని ద్విచక్రవాహనంపై నుండి రోడ్డు మీద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు.
కానీ అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వావిలాల స్వామిరాజు గుండెపోటుగా గ్రహించిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్) ప్రక్రియను చేశాడు. దీంతో ఆ వ్యక్తి కాసేపటికి స్పృహలో వచ్చాడు. ఆ తర్వాత ఎం.జీ.యంకు సకాలంలో తరలించడంతో రేషన్ డీలర్ రాజు ప్రాణపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఒక వ్యక్తిని సీపీఆర్ ప్రక్రియతో ప్రాణాలు కాపాడినందుకు నిట్ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో జరిగిన సమావేశంలో హోంగార్డు స్వామిని పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు.
మరో సంఘటనలో
చిల్పూరు మండలం గార్లగడ్డ తండా పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్లో శనివారం గల్లంతైన యువకుడుని రక్షించేందుకు కానిస్టేబుల్ వీరన్న సాహసం చేశాడు. వీరన్న ధైర్యం చేసి యువకుడు మునిగిన చోట దూకి వెతుకులాడి అతడిని బయటకు తీసుకవచ్చాడు. కానీ అప్పటికే శేఖర్ చనిపోయాడు. నీట మునిగిన యువకుడుని కాపాడేందుకు ధైర్యం చేసిన కానిస్టేబుల్ వీరన్నను కూడా పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి నగదు రివార్డు అందజేశారు.