కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు మళ్లీ ఆందోళనలోపడ్డాయి. దక్షిణాఫ్రికా 49 దేశాల్లో ఇప్పటికే ఈ మహమ్మారి తన ప్రభావం చూపుతోంది. అయితే.. ఇండియాలో నమోదైన మొదటి ఒమిక్రాన్ వేరియంట్ బాధితుడు మాత్రం కోలుకుని హ్యాపీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం మహారాష్ట్ర అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతన్ని డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 33 సంవత్సరాల ఓ వ్యక్తి కల్యాణ్‌లోని డోంబివిలి మున్సిపల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆయన మెరైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి దుబాయికి చేరుకున్నాడు. అటు నుంచి దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు తప్పని సరి చేసింది. వారిని వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండాలనే మార్గదర్శకాలు సైతం జారీ చేసింది.
ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మెరైన్ ఇంజినీర్‌కు కరోనా వైరస్ ఆర్టీ పీసీఆర్ పరీక్షల నిర్వహించారు. అయితే, పరీక్ష ఫలితాలు వచ్చేలోపు ఆయన ముంబయికి వెళ్లాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆ ఇంజినీర్ కు తెలియజేశారు. అలాగే, ప్రభుత్వ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అతని స్వాబ్ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని నిర్ధారించారు. అలాగే, మెరైన్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆ వ్యక్తి గత ఏప్రిల్‌లో నుంచి సముద్ర ప్రయాణలోనే ఉన్నాడనీ, దీని కారణంగా అతను కరోనా టీకాలు సైతం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ వేరియంట్ గురించి కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) కమిషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆ మెరైన్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ సోకినట్టు గత నెలలోనే నిర్ధారించారని తెలిపారు. దీంతో ఆయనను కల్యాణ్‌లోని కొవిడ్-19 కేర్ సెంటర్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఇక బుధవారం ఆయనకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామనీ, ప్రస్తుత ఫలితాల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో అతన్ని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి డిశ్చార్జి చేశామని సూర్యవంశీ వెల్లడించారు.
కరోనా వైరస్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలనీ, వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సదరు వ్యక్తికి సూచించామని డాక్టర్ సూర్యవంశి చెప్పారు. ఇదిలావుండగా, ఒమిక్రాన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 10 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు, మరణాల్లో అధికం మహారాష్ట్రలోనే నమోదైన సంగతి తెలిసిందే.