కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులపై ప్రెషర్ పడనీయకుండా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 11 పరీక్షలు రాసే భారాన్ని తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 పరీక్షలకు బదులు ఏడు పరీక్షలే జరిపి.. వచ్చే ఏడాది నుంచి యధావిధిగా 11 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020, 2021లో జరగాల్సిన ఎగ్జామ్స్ పూర్తిగా రద్దయ్యాయి.
పదో తరగతి ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం పరీక్ష పేపర్లను తగ్గించింది. 11 పేపర్లకు బదులుగా 7 పేపర్ల విధానాన్ని అవలంభించనున్నారు ఈ మేరకు ప్రభుత్వం సవరణ జీఓ ఇచ్చింది. పేపర్ ప్యాటర్న్‌లో కూడా మార్పులు చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి కూడా 7 పేపర్లే ఉంటాయి. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులకు ఒకే పేపర్ ఉంటుంది. మొత్తం 100మార్కులకు 33 ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమంటారు. పరీక్షా సమయం 3.15 గంటలుగా నిర్ణయించారు. ప్రభుత్వం అందించే 24 పేజీల బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. 2019లో పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇంతవరకు పది పరీక్షలు జరుగలేదు.