హైదరాబాద్ నగరవాసులకు ఇది గుడ్‌న్యూసే. కరోనా కేసులు పెరగడంతో అర్ధంతరంగా ఆగిపోయిన నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి ఆదిత్య మీడియాకు వివరాలు వెల్లడించారు. 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించిన తర్వాత ఒమిక్రాన్ నేపథ్యంలో అర్ధంతరంగా మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ పునఃప్రారంభానికి అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా నుమాయిష్‌ను మళ్లీ ప్రారంభించేందుకు అనుమతించారు. దీంతో ఎగ్జిబిషన్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ 46రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు.