Monday, November 25, 2024

Big Story: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్థానిక‌త ఆధారంగా బ‌దిలీలు..

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కొత్త జోనల్‌ విధానం వచ్చినప్పటి నుంచి సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చని చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్‌న్యూస్‌ చెబుతూ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై నిన్న‌ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వేలాదిమంది ఉద్యోగులు వీటికోసం ఏళ్ళుగా నిరీక్షిస్తుండగా, సర్కారు విధివిధానాలు ఖరారు చేయడంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మల్టిజోనల్‌ విధానం వల్ల కొత్త ఖాళీలు ఏర్పడతాయని, ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అవుతుందని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి.

ఉద్యోగుల కేటాయింపు కోసం జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌, జోనల్‌, మల్టి జోనల్‌ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా శాఖల కార్యర్శులు, శాఖాధిపతులు, ఆర్థికశాఖ నుంచి సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇతర సీనియర్‌ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అనంతర ప్రక్రియ నిర్వహించాలని తెలిపింది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్న ప్రభుత్వం.. సీనియారిటీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పడ్డాయి. జోనల్‌, మల్టిజోనల్‌కు సంబంధించి కూడా ఈ తరహా అంశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, జోనల్‌, మల్టిజోనల్‌ కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చి అనుబంధాలను వెలువరించింది. బదిలీల అనంతరం ఖాళీలపై పూర్తిస్పష్టత వస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈనెలలోనే ఉద్యోగుల విభజన పూర్తిచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్లు ఇస్తామని తాజాగా చెబుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఇవన్నీ జరుగుతాయా? కొత్ప సమస్యలు ఏవైనా ఉత్పన్నమవుతాయా? ఉద్యోగాల భర్దీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఎపుడు విడుదల అవుతాయి? అన్నది రానున్నరోజుల్లో తేలనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement