Saturday, November 23, 2024

ఉందిలే మంచికాలం ముందూముందునా..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – మూడు శతాబ్దాల క్రితం అమెరికాలో ప్రజల సగటు ఆయుర్దాయం 40ఏళ్ళు. భారత్‌లో ఇది 28.1 ఏళ్ళు మాత్రమే. కాగా ఇప్పుడు అక్కడా.. ఇక్కడా సగటు ఆయుర్దాయం 76.3 సంవత్సరాలు. ఈ మూడు శతాబ్ధాల్లో ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక అద్భుతాల్ని సాధించింది. వైద్యరంగంలో పలు కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఇవి మానవ జీవన విధానంలో పలు మార్పుల్ని తెచ్చాయి. అయినా పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, వాతావరణం, విద్య, వైద్యం, విద్యుచ్చక్తి వంటి అంశాల్లో ప్రపంచం యావత్‌ పలు ఇబ్బందు ల్ని ఎదుర్కొంటోంది. రాన్రాను మానవ జీవితం మరింత దుఖ:భరితమౌతుం దన్న ఆవేదన ప్రస్తుత తరంలో నెల కొంది. ఇటీవల అమెరికాలో నిర్వహించి న ఓ సర్వేలో కేవలం 42శాతం మంది యువత మాత్రమే తమ తల్లిదండ్రుల కంటే తమ భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుం దన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 లో కూడా ఇలాంటి సర్వే జరిగింది. అప్ప ట్లో 60 శాతం మంది భవిష్యత్‌పై ఆశా వహులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత తరాలు భవిష్యత్‌ పట్ల డోలాయమానంలో ఉన్నాయి.

వైద్యం, ప్రకృతి, విద్యుచ్ఛక్తి వంటి అంశాల ు తమ జీవన ప్రమాణాల్ని తీవ్రంగా దిగజారుస్తాయన్న ఆందోళనకు ఈ తరాలు గురౌతున్నాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ విద్యాసంస్థలో నిర్వహించిన మేధోమధనంలో మాట్లాడిన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు, ప్రముఖ బిలియనీర్‌ బిల్‌గేట్స్‌ చేసిన వ్యాఖ్యలిప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచంలో గతంలో ఎన్నడూ లేనంతగా రానున్న 40 ఏళ్ళ తర్వాత పుట్టిన తరం గొప్పగా జీవిస్తుందంటూ గేట్స్‌ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రస్తుత మానవళి ఎదుర్కొంటున్న పలు సమస్యల నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు అప్పటికి సంపూర్ణ ఫలితాలిస్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్‌పై మానవళి విజయం సాధిస్తుంది. పోలియోను సమూలంగా నిర్మూలిస్తుంది. ఊబకాయాన్ని నియంత్రించగలుగుతుంది. మెరుగైన వైద్యం అతితక్కువ ధరకే అన్నివర్గాలకు అందుబాటులోకొస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా నవజాత శిశువుల మరణాలు నామమాత్ర మౌతాయి. గత రెండు దశాబ్దాల్లోనే ఐదేళ్ళ లోపు పిల్లల మరణాల రేటును సగానికి తగ్గించగలిగిన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఈ క్రమంలో మరింత మెరుగైన ఫలితాన్ని సాధిస్తుంది.

తక్కువ వ్యయంతో గ్రీన్‌ ఎనర్జీ అందుబాటులోకొస్తుంది. ఇది సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే ఇంటర్‌నెట్‌ వినియోగంలో అద్భుతమైన మార్పులొస్తాయి. విద్య, వైద్యరంగాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. రోగికి, ఆరోగ్యవ్యవస్థకు మధ్య దూరాన్ని తగ్గిస్తాయి….అంటూ బిల్‌గేట్స్‌ చెప్పుకొచ్చారు. వాస్తవానికి గత తరంతో పోలిస్తే ప్రస్తుత తరం మెరుగైన జీవన ప్రమాణాల్ని కలిగున్నారు. అయితే అందొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కొన్ని ప్రమాదాల్ని కూడా సృష్టించింది. శాస్త్రీయ పరిణామ క్రమంలో అణ్వాయుధాలు, బయో టెర్రరిజాలు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. ఆధునికత సహజంగానే కొన్ని ప్రమాదాల్ని కొనితెస్తుంది. అయితే వాటి నివారణా మార్గాల్ని కూడా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మనకందుబాటులోకి తెస్తుందంటూ ఆయన హామీనిచ్చారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొత్తం ఆవిష్కరణల రూపాన్ని మార్చేస్తుంది. అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రమాణాల్ని నెలకొల్పు తుందంటూ ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత తరం నిరాశావాదంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గేట్స్‌ వ్యాఖ్యలు ఆశావాద దృక్పధాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే ఆశావాద అధ్యయన నివేదికల్లో ఈ ఏడాది అత్యల్ప స్థాయిలో ఆశావాదం నమోదైంది. ఈ దశలో వివిధ రంగాలపై స్పష్టమైన అవగాహన కలిగిన బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలు భవిష్యత్‌ ప్రామాణికతకు అద్దంపడుతున్నాయి.
భవిష్యత్‌ ప్రపంచం
2040నాటికే పక్షవాతాన్ని పూర్తిగా నియంత్రించగలుగుతారు. పక్షవాతం సోకిన అవయవాల మెరుగుకు నరాల శస్త్ర చికిత్స సంపూర్ణ స్థాయిలో అందుబాటులొకొస్తుంది. అలాగే మూలకణాల నుంచి కృత్రిమ రక్తాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయగలుగుతారు. ఇది మార్కెట్లో సాధారణ ధరకు లభిస్తుంది. వేగంగా విస్తరిస్తున్న డయాబెటీస్‌ టైప్‌ 2ను అదుపు చేయడానికి ప్రొటీన్‌ ఇంజక్షన్లు అందుబాటులోకొచ్చేస్తాయి. అన్నిరకాల జ్వరాలు, సంక్రమిత వ్యాధుల్నుంచి రక్షించేందుకు ఒకే వ్యాక్సిన్‌ రూపుదిద్దుకుం టోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ ప్రజలకందుబాటులో ఉంటుంది. అలాగే 3డి టెక్నాలజీ ద్వారా అవయవాల తయారీ రంగం వృద్ధి చెందుతుంది. అప్పటికి ప్రతి వ్యక్తి శరీరంలోని పోషక స్థాయిలకనుగుణంగా ఆహారాన్ని డిజైన్‌ చేసే ఫుడ్‌ రెప్లికేటర్లు అందుబాటులోకొచ్చేస్తాయి. అల్జిdమర్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అయితే దాని నివారణకు కూడా మందుల రూపకల్పన జరుగుతోంది. మనిషి మెదడును రోబోట్‌లోకి పంపించే కొత్త సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగాలు ఓ దశకు చేరుకుంటాయి. జెనటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా డబ్బులు చెల్లించి నచ్చిన రూపం, గుణగణాల్తో కూడిన బిడ్డల్ని కనగలిగే పరిజ్ఞానం సమకూరుతుంది. మానవ భావోద్వేగాల్ని కూడా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీకి అనుసంధానం చేయగలిగే సమర్థత అందుబాటు లోకొస్తుంది. పలురకాల క్యాన్సర్‌లన్నింటి నివారణకు ఒకే టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ చౌక ధరలో అందుబాటులో ఉంటుంది. న్యూరో టెక్నాలజీని ఉపయోగించి ఇతర వ్యక్తుల్తో సంభాషించే వీలేర్పడుతుంది. మనిషి అవయవాలు కూడా తక్కువ ఖర్చుతో అందుబాటులోకొచ్చేస్తాయి.

సొంత అవయవాలకంటే ఇవి మరింత ఆధునికంగా, వేగంగా ఖచ్చితత్వంతో పని చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగాలు పెరుగుతాయి. జర్మనీ, అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, వంటి దేశాల్లో పూర్తిగా డీజిల్‌, పెట్రోల్‌ ఇంధన వాహనాలపై నిషేధం అమ లౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 50లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ము డౌతాయి. 2050నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ కనెక్ట్‌ చేయబడిన పరికరా ల సంఖ్య 237.50 బిలియన్లకు చేరుకుంటుంది. ప్రతి వ్యక్తి ఇంటర్‌నెట్‌ కనెక్ట్‌ చేయబడ్డ 23 పరికరాల్ని కలిగుంటాడు. బహుళ అంతస్తుల హైటెక్‌ భవనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. దీంతో నివా సాల కొరత తగ్గుతుంది.

- Advertisement -

మార్స్‌ మీద శాశ్వత నివాస ఏర్పాట్లు ఓ కొలిక్కొస్తాయి. చంద్రునిపైకి సాధారణ ప్రజలు కూడా హాలీడే ట్రిప్‌కు వెళ్ళడం అందుబాటు లోకొస్తుంది. స్పేస్‌ ఎక్స్‌ తన స్పేర్‌ షిప్‌లో మార్స్‌కు మనుష్యుల రవాణా ప్రారంభిస్తుంది. గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ మరింత పెరుగుతుంది. ఆన్‌లైన్‌ వీడియో, మీడియా విస్తృతమౌతుంది. ప్రపంచవ్యాప్తంగా మహా సముద్రాల నుంచి వనరుల సేకరణ పెరుగుతుంది. క్వాంటం కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగంతో యంత్రాల పనివేగం పుంజుకుంటుంది. తూర్పు, మధ్య దృవ ప్రాంతాల్లో కొంత భాగం ఉష్ణోగ్రతలు పెరుగుతా యి. అలాగే ఆఫ్రికాఖండంలోని కొంత భాగంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతా యి. దీంతో ఈ ప్రాంతాలు కొత్తగా మానవ జీవనానికి అనుకూలమైన వాతా వరణాన్ని కలిగుంటాయి.
రానున్న కాలంలో మానవుడికి అందుబా టులోకొచ్చే ఆధునిక వసతులన్నిం టిని శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన మేధావులు ఇప్పటికే ప్రపంచం ముందుం చారు. ఈ దశలో బిల్‌గేట్స్‌ వ్యక్తం చేసిన ఆశావాదం కూడా ప్రస్తుత తరంలో భవిష్యత్‌ పట్ల స్పష్టమైన భరోసానిస్తోంది. ఇక గేట్స్‌ అభిప్రాయపడ్డ విధంగా 40 ఏళ్ళ తర్వాత భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరు గత, ప్రస్తుత తరాలెదుర్కొన్న విభిన్న తరహా ఇబ్బందుల్తో సతమతం కావాల్సిన అవసరంలేదని స్పష్టం చేస్తోంది. దీర్ఘకాలిక రోగాలు, అంటు వ్యాధులు, పర్యావరణ ఇబ్బందులు, విద్యుచ్ఛక్తి కొరత, ఆహార కరవు, వంటి ఇబ్బందులేవీ 40ఏళ్ళ తర్వాత పుట్టినవారికి ఉండవన్న ఆశావాదం ప్రబలుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement