హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీల్లో ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్నో ఏళ్ళుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారు సైతం వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీకి దిగి సత్తా చాటేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నందమూరి తారక రామారావు ఆ తర్వాత చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వర రావు, ఇనగాల పెద్దిరెడ్డి, అన్నపూర్ణమ్మ, రాజేశంగౌడ్ వంటి సీనియర్ నేతలు ఈ అసెంబ్లి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మోత్కుపల్లి నరసింహులు ఆలేరు లేదా భువనగిరి, మునుగోడు నియోజక వర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా అసెంబ్లి ఎన్నికల్లో బరిలోకి దిగుతానని మోత్కుపల్లి చెప్పినట్టు భారాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఆరు సార్లు పోటీ చేసి గెలిచిన ఆలేరు నుంచే పోటీ చేస్తానని అందుకు అవకాశమివ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం.
కాగా గురువారం ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మోత్కుపల్లి చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లి ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండటానికి సన్యా సిని కానంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కచ్ఛితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ అసెంబ్లి నియోజక వర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. అయితే.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని పేర్కొ న్నారు. తనపై కేసీఆర్ ఆశీస్సులు కచ్ఛితంగా ఉంటాయన్నారు. ఆలేరు నియోజకవర్గం నుండి తాను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. గతంలో తనకు ఏ పార్టీ కూడా అవ కాశం ఇవ్వకపోయినా.. ఆలేరు ప్రజలు తనని గెలిపించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఎవరికి అవకాశం ఇచ్చినా.. ఆలేరులో బీఆర్‌ఎస్ పార్టీ కచ్ఛితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మోత్కుపల్లి చేసిన ప్రకటనను బట్టి చూస్తుంటే నాలు గు మాసాల్లో జరిగే అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి భారాస అధినేత కేసీఆర్ ఖచ్చింతగా బరిలో నిలుపుతున్నారన్న విషయం స్ప ష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్ బరిలో మండవ?
ఎన్టిఆర్, చంద్రబాబు మంత్రి వర్గంలో కీలకమైన సాగు నీటి పారుదల, ప్రాధమిక విద్య మంత్రిత్వ శాఖలను నిర్వహంచిన మండవ వెంకటేశ్వర రావును సైతం ఈ అసెంబ్లి ఎన్ని కల్లో పోటీకి పెడతారన్న ప్రచారం జరుగుతోంది. నిజా మాబాద్ రూరల్ అసెంబ్లి సెగ్మెంట్ నుంచి పోటీకి పెట్టే విష యంలో భారాస అధినేత కేసీఆర్ సమాలోచనలు జరుపు తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒ కవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయించడం సాధ్యం కాకపోతే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి మండ వకు కట్టబెట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ మండవ ఇంటికెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. నిజా మాబాద్ లోక్‌సభ నుంచి తన కుమార్తె కవితకు పూర్తి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరడంతో అందుకు ఆయన అంగీకరించి కవిత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండవకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని కమ్మ సామజిక వర్గం కోటాలో కీలక పదవి వరిస్తుందని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరి గింది. అయితే తన కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నిక కోసం కేసీ ఆర్ మండవను ఉపయోగించుకుని వదిలేశారన్న అపవాదు రాకుండా ఉండేందుకే అసెంబ్లి ఎన్నికల్లో ఆయనను పోటీకి పెట్టాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిజా మాబాద్ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్దన్ ఉన్నా రు. ఆయన ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నారు.
హుజురాబాద్ బరిలో ఇనగాల పెద్దిరెడ్డి?
హుజురాబాద్ అసెంబ్లి అభ్యర్థిగా మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం తెలుగుదేశంలో కొనసాగిన పెద్దిరెడ్డి అనంతరం భాజపాలో చేరారు. ఈటల రాజేందర్ భారాసకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, భాజపాలో చేర డంతో హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మె ల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశించిన పెద్దిరెడ్డి క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హుజురాబాద్ అసెంబ్లి ఇన్‌చార్జ్‌గా ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో ఆయనే అధికార పార్టీ అభ్యర్థి అన్న ప్రచారం జరుగుతున్నా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి బదు లుగా మరో సీని యర్‌ను పోటీకి పెట్టాలన్న యోచ నలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ నుం చి బరిలో ఉంటారని భారాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నియోజక వర్గంలో పర్యటించిన సంద ర్భంగా నిర్వహంచిన బహరంగ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
జగిత్యాల బరిలో రాజేశం గౌడ్
మాజీ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్ సైతం అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి సిద్ధమ వుతున్నట్టు సమాచారం. తమ సామాజికవర్గం ఓటర్లు అధి కంగా ఉన్న జగిత్యాల సెగ్మెంట్ నుంచి పోటీకి అవకాశం ఇవ్వా లని ఆయన కోరుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన రాజేశం గౌడ్ అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళూరుతున్నట్టు తెలుస్తోంది. బీసీ సామజిక వర్గాలకు ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్ రాజకీయ అనుభవం ఉన్న బీసీ సామజిక వర్గ నేతలను అన్వేషిస్తున్నట్టు సమాచారం.
కాగా తెదేపా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లేదా బాల్కొండ నుంచి ఆమె భాజపా తరపున బరిలోకి దిగే అవకాశమున్నట్టు సమాచారం. గత పదేళ్లుగా ఆమె రాజకీయాలకు అంటీ ముంటనట్టు ఉం టున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని మద్దతు దా రులు, అభిమానులు ఆమెను ఒత్తిడి చేస్తున్నట్టు చెబు తు న్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి విశేష అనుభవం ఉన్న కొందరిని అసెంబ్లికి ఎంపిక చేసి బరిలో నిలపాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులను లోక్‌సభకు పంపించాలన్న యోచనలో ఉన్నారన్న ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది.