Tuesday, November 26, 2024

పెరిగిన బంగారం ధరలు.. అందనంత ఎత్తులో వెండి

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరి నేటి..బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర తాజాగా మరో రూ.150 పెరిగి రూ.49,600కు చేరింది. 6 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.1100కుపైనే గోల్డ్ రేటు పెరిగింది. 10-15 రోజుల నుంచి కూడా పెద్దగా తగ్గిందే లేదు. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ కూడా హైదరాబాద్‌లో రూ.160 మేర పెరిగి ప్రస్తుతం రూ.54,110 మార్కు వద్ద ఉంది. ఇది ఎన్నో నెలల గరిష్టం కావడం గమనార్హం. దీంతో ఇప్పట్లో బంగారం, వెండి కొనాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెరుగుతాయో, తగ్గుతాయో సరైన స్పష్టత కనిపించడం లేదు.ఇక వెండి మాత్రం అందనంత ఎత్తులో నిలిచింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి మరో రూ.900 పెరిగి.. రూ.72,500కు చేరింది. 5 రోజుల్లో ఏకంగా రూ.4500 మేర వెండి రేటు పెరగడం గమనార్హం. ఇది ఆల్ టైమ్ హై అని నిపుణులు చెబుతున్నారు.మరోవైపు అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై సరైన స్పష్టత కరవైంది. అమెరికాలో మెరుగైన డేటా అంచనాల నడుమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. దీంతో పాటు అక్కడ వడ్డీ రేట్ల పెంపు కూడా ఈసారి తక్కువగా ఉండనున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. అయితే.. డిసెంబర్ 13-14 తేదీల్లో ఈ సమావేశం జరగనుంది. మరోవైపు.. యూఎస్ కీలక గణాంకాలు మెరుగుపడటంతో డాలర్ కూడా ఐదు వారాల కనిష్టం నుంచి పుంజుకుంది. దీంతో ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement