కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హీపనహల్లిలో జరిగింది. ఆవు నెక్లెస్ ని మింగేసింది. వివరాల్లోకి వెళ్తే .. శ్రీకాంత్ హెగ్డే కి నాలుగేళ్ల ఆవు ఉంది. కాగా దానికి ఓ లేగ దూడ కూడా ఉంది. ఉత్తర కన్నడ జిల్లాలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాటికి పూలమాలలు వేసి, బొట్టు పెట్టి పూజలు చేయడం ఆనవాయితి. ఆవు అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కొలుస్తుంటారు. అందుకే ఆవుల మెడలో పూజలు చేసినంత సేపు బంగారు ఆభరణాలు వేస్తారు. పూజ పూర్తయ్యాక వాటికి ఆహారం పెట్టి ఆ తర్వాత వాటి మెడలోని బంగారాన్ని తీసేస్తారు.ఆవుకు పూజలు నిర్వహించే సమయంలో ఇంట్లో ఉన్న లక్షల విలువ చేసే 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను దాని మెడలో వేశారు. పూజ అయిపోయాక పూలతో పాటు.. నెక్లెస్‌ను కూడా తీసేసి కింద పెట్టారు. కొంత సేపటి తర్వాత నెక్లెస్ కనిపించడం లేదు. పూలతో పాటు.. నెక్లెస్‌ను తీసి కింద పెట్టిన మరుక్షణమే పూలతో పాటు.. ఆ నెక్లెస్‌ను కూడా ఆవు మింగేసింది. ఆ విషయం తెలియక నెక్లెస్ కోసం ఇల్లంతా వెతికినా కనిపించలేదు. చివరకు.. ఆవు మింగిందేమో అన్న అనుమానం వాళ్లకు కలిగింది. దీంతో అది పేడ వేస్తే.. దానితో పాటు నెక్లెస్ కూడా వస్తుందిలే అని అనుకున్నారు.
అలా ఓ నెల రోజుల పాటు.. దాని పేడను రోజూ చెక్ చేస్తూ వచ్చారు కానీ.. ఫలితం శూన్యం. దీంతో ఒకరోజు ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ మెటల్ డిటెక్టర్‌తో స్కాన్ చేయగా.. ఆవు పొట్టలో నెక్లెస్ ఇరుక్కుపోయినట్టు గుర్తించాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆవు పొట్టలో ఉన్న నెక్లెస్‌ను తీయడం కోసం ఆ ఆవుకు సర్జరీ చేయించాల్సి వచ్చింది. అంతకుముందు 20 గ్రాములు ఉన్న నెక్లెస్.. కడుపులో నుంచి బయటికి వచ్చాక 2 గ్రాములు తగ్గిందట. నెక్లెస్‌లోని ఒక చిన్న భాగం మాత్రం మిస్ అయినా.. మిగితా నెక్లెస్ మొత్తం అలాగే ఉండటంతో ఫ్యామిలీ మొత్తం ఊపిరిపీల్చుకుంది. కాకపోతే.. ఆవుకు ఆపరేషన్ చేయించి.. దాన్ని ఇబ్బంది పెట్టామని మాత్రం వాళ్లు బాధపడ్డారు. ప్రస్తుతం ఆవు రికవరీ అయిందట. దాంతో ఆ ఫ్యామిలీ ఊపిరిపీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..