Sunday, November 3, 2024

దేశ వ్యాప్తంగా గోబర్‌-ధన్‌ ప్లాంట్లు.. ఇండోర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మోడీ

దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో బయో -సీఎన్‌జీ ప్లాంట్లను నెలకొల్పుతామని, ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కర్బన రహిత ఇంధనాలు వాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆ దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎలక్ట్రానిక్‌ వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకువస్తున్నామని వివరించారు. గోబర్‌-ధన్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్ల కాలంలో.. దేశ వ్యాప్తంగా 75 బయో-సీఎన్‌జీ ప్లాంట్లు ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. గోబర్‌-ధన్‌ ప్లాంట్లపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అవగాహన కల్పిస్తామని మోడీ ప్రకటించారు. పారేసే చెత్త నుంచి కూడా ఇంధనం తయారు చేసి వినియోగించుకోవచ్చని తెలిపారు. మున్సిపాల్టిdలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ప్రతీ రోజూ వేలాది టన్నుల చెత్త సేకరించడం జరుగుతుందన్నారు. ఘన వ్యర్థాలను కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)గా మార్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఆసియాలోనే అతిపెద్దది..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో నిర్మించిన గోబర్‌-ధన్‌ ప్లాంట్లను మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ ఇదే అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా వాటిని నిర్మిస్తామని అన్నారు. నగరాల్లో క్లీన్‌ ఎనర్జీ, కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించడంలో భాగంగా ఇలాంటి ప్లాంట్లు విరివిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వాయు కాలుష్యం కారణంగా భూమిపై వేడి పెరుగుతోందని, దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెప్పుకొచ్చారు. శిలాజ ఇంధన వాడకాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తామని, ప్రకృతికి మేలు చేకూర్చే వాటిపైనే దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు.


ప్లాంట్లకు కేంద్రం ఆర్థిక సహకారం
రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ప్లాంట్లకు కేంద్రం నుంచి కూడా సహకారం ఉంటుందని మోడీ ప్రకటించారు. వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడమే తమ ముందు ఉన్న లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.150 కోట్లను ఖర్చు చేస్తున్నాయి. 550 మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలను ఈ ప్లాంట్‌లో ప్రాసెస్‌ చేయవచ్చని అన్నారు. 100 టన్నుల కంపోస్ట్‌ నుంచి 17,500 కేజీల బయో గ్యాస్‌ను ఇండోర్‌ ప్లాంట్‌ ఉత్పత్తి చేసే సత్తా కలిగి ఉంటుందని మోడీ చెప్పుకొచ్చారు. 100 శాతం వ్యర్థాలతోనే ఈ ప్లాంట్‌ నడుస్తుందని, 96 శాతం మీథేన్‌ గ్యాస్‌తో సీఎన్‌జీ ఇక్కడ ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రజా రవాణాలో వినియోగించే వాహనాలకు 50శాతం సీఎన్‌జీని సరఫరా చేస్తారన్నారు.


400 బస్సులకు బయో-సీఎన్‌జీ
మిగిలిన 50శాతాన్ని పరిశ్రమలకు కేటాయిస్తారని మోడీ తెలిపారు. ప్రజా రవాణాలో భాగంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 400 బస్సులకు ఈ బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ నుంచి బయో గ్యాస్‌ సరఫరా అవుతుందని తెలిపారు. ఇలాంటి ప్లాంట్లను దేశ వ్యాప్తంగా నిర్మించుకోవడం ద్వారా.. ఘన వ్యర్థాలను వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ ఉద్దేశంతోనే ఇండోర్‌ తరహా ప్లాంట్లను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో 75 ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాతావరణ పరమైన రక్షణ చర్యలకు భారత్‌ కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. ప్యారిస్‌ ఒప్పందాలను కూడా అమలు చేస్తామని, అనుకున్న లక్ష్యం కంటే ముందు లక్ష్యాలను సాధించి తీరుతామన్నారు. ప్రతీ ఒక్కరు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు నడుం బిగించాలని సూచించారు. వచ్చే అంకుర సంస్థలు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement