హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు (బుధవారం) కీలక ప్రకటన చేయబోతున్నా. రేపు ఉదయం 10గంటలకు నిరుద్యోగులంతా టీవీ చూడాలి. ఏం ప్రకటన చేయబోతున్నానో, ఏవిధమైన తెలంగాణ ఆవిష్కృతమవతదో చూడాలి” అని సీఎం కేసీఆర్ నిరుద్యోగులను కోరారు. ఎన్నో పనులు ఎవరు అడగకున్నా చేసుకున్నాం. ధర్నాలు, దరఖాస్తులు పెట్టుకొకున్నా చేసినం. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాల, కలెక్టరేట్ నూతన భవన సముదాయం ప్రారంభోత్వవం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముందుగా అంతర్జాతీయ ఆడబిడ్డల దినం ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ , ప్రపంచ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడ స్త్రీలు పూజించి, గౌరవించబడుతారో… అక్కడ దేవతలు సంచరిస్తుంటారని, తెలంగాణలో పేదింటి బిడ్డలను ఆదుకోవడానికి అనే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆ పథకాలన్నీ మీ ముందు గ్రామాల్లో కనిపిస్తున్నాయన్నారు.
అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా.. వనపర్తి జిల్లా అయితదని ఎవరూ కలకనలేదు..
వనపర్తి జిల్లా అయితెదని ఎవరూ కల కనలేదు. వనపర్తి జిల్లా కావటంతోపాటు ఎదురుగా కనిపస్తున్నా కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, పోలీసు కార్యాలయం భవనాలు వచ్చాయి. ఈ అభివృద్ధిని వనపర్తికి రప్పించుకున్నందుకు ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి, నేతలకు, హృదయపూర్వక అభినందనలు చెబుతున్నా. 2001 తర్వాత పిడికెడు మందితో ఉద్యమానికి బలయర్దేరిన నాడు… చాలాసార్లు మహబూబ్‌నగర్‌కు వచ్చిన కన్నీళ్లతో వెళ్లాను. నడిగడ్డ, నారాయణపేట, కొడంగల్‌లో కావచ్చు, పల్లెల్లో మొలిసిన పల్లేరు చెట్లు. ఎన్నో రకాల బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, యుద్దాలు…అయినా మీ దీవెనతో కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రమొచ్చింది. కేసీఆర్ మీ దీవెనతో పనిచేస్తే రాష్ట్ర ప్రత్యేక రాస్ట్రంగా ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మీరంతా దీవించి పంపించారు. అంతకు ముందు మెడికల్ కాలేజీనే లేని పాలమూరు జిల్లాలో ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి. తెలంగాణ వస్తే జరిగే అభివృద్ధి కథ ఇది.
పాలమూరు రోడ్ల వెంట ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే..
ప్రస్తుతం పాలమూరు జిల్లాలో రోడ్ల వెంట ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నాన్న చనిపోతే పలకరించేందుకు బస్సులో వెళ్లాను. నేను పాలమూరు రాక చాలా రోజులైంది. హెలికాప్టర్‌లో కాకుండా బస్సులో పోదామని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పి హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చా. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే కనిపించాయి. ఇవాళ పాలమూరు జిల్లా పాలుగారుతోంది. ఇంకా కావాలి.
పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తి…
పాలమూరు ఎత్తిపోతల పథకం… గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర సంస్థల సందేహాలు నివృత్తి చేసి… పాలమూరు ఎత్తిపోతలను కూడా పూర్తిచెస్తే ఈ ప్రాంతం పచ్చబడుతుంది. గతంలో పాలమూరు ప్రాంతం నుంచి వలసలు పోయేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీన్ మారింది. ఇప్పుడు రాయచూర్, కర్నూలు తోపాటు దేశంలోని 11 రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వలస కూలీలు వచ్చి తమ జీవనాన్ని గడుపుతున్నారు. ఏడేళ్లుగా కడుపుకట్టుకుని, నోరు కట్టుకుని అవినీతిరహితంగా పనిచేస్తేనే ఈ ఫలితాలు వచ్చాయి.
మీరు నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే.. ఆయన ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాడు..
మంత్రి నిరంజన్‌రెడ్డి ఏంచేశాడో మీ కళ్ల ముందు కనబడుతోంది. అదేదో మండలంలో కర్నెతండా వద్ద లిఫ్ట్ కావాలని నాతో పంచాయతీ పెట్టుకుని, నన్ను తిననీయకుండా, పండ నీయకుండా వెంటపడి మంజూరు చేయించుకున్నాడు. నిరంజన్‌రెడ్డి తనకు మంచిస్నేహితుడు. తన ప్రాంతానికి ఎంతో చేయాలని పరితపిస్తుంటాడు. నిన్న కూడా అసెంబ్లిdలో ఏదో 18కోట్ల రోడ్ల పనులను నా మెడపై కత్తిపెట్టి సాధించుకున్నాడు. నిరంజన్‌రెడ్డిని గెలిపించాలని ఎన్నికల సభలో మీమ్మల్ని కోరితే… మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు నిరంజన్‌రెడ్డి మిమ్మలన్ని గెలిపించాడు. ఈ సారి నిరంజన్‌రెడ్డి నామినేషన్ వేస్తే లక్ష పైచిలుకు మెజారిటీ రావాలి. ఆలంపూర్‌లో డాక్టర్ పోటీ చెస్తే … తుమ్మిళ్ల నుంచి నీళ్లు దునికినట్లు డాక్టర్ డబ్బా (పోలింగ్ బాక్స్) నిండింది.
పాలమూరు అభివృద్ధిపై స్వయంగా పాటరాసిన సీఎం
పాలమూరు ప్రాంత అభివృద్ధిపై నేనే పాట రాశాను. ఇప్పుడు నాకు పాడటం వస్తలేదు. వెనకట పాడేటోన్ని. అని పాలమూరు ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా తాను రాసిన పాటను పాడి వినిపించారు. ఏ నడిగడ్డలో నేను కన్నీల్లు పెట్టుకున్నానో, ఏ పాలమూరు తండాలను చూసి తాను, ప్రొ. జయశంకర్ ఏడ్చామో, లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తండాలు అప్పుడు ఎలా గోసపడ్డాయో అవన్నీ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు లేవు. గిరిజన గూడాలు, లంబాడాతండాలను గ్రామ పంచాయతీలు మార్చుకున్నాం. ఇప్పుడు దేశంలోనే గొప్ప గ్రామాలు ఎక్కడున్నాయి అని అడిగితే తెలంగాణలో ఉన్నాయని చెబుతున్నారు. దేశం మొత్తం మీద 10 ఆదర్శ గ్రామాలకు అవార్డులు ఇస్తే అందులో 7 తెలంగాణలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని 12769 గ్రామాల్లో ప్రతీ గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ ఉన్నాయి. ఇంకా నాలుగైదేళ్లలో తెలంగాణ గ్రామాలు స్వర్గసీమలు కానున్నాయి. పాలమూరు ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేస్తాం. 24 గంటల కరెంటు ఇస్తున్నాం. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. వనపర్తిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జనార్థన్‌రెడ్డి, గువ్వల బాలరాజు నన్ను కొట్టేటట్టు ఉన్నారు. మా ప్రాంతాల్లో ఎప్పుడు ఇవన్నీ చేస్తావు..? అని నిలదీస్తరు. ఏం జనార్థన్‌రెడ్డి కొడుతవా..?.
అనేక అంశాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
అనేక అంశాల్లో దేశంలోనే తెలంగాణ ముందుంది. రాష్ట్ర తలసరి ఆదాయం, తలసరివిద్యుత్ వినియోగం దేశంలోనే నం.1గా ఉంది. అనేక రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది. ఇప్పుడు పాలమూరు ప్రాంతంలో రోడ్డు పక్కన ఎకరానికి రూ.3కోట్ల దాకా పోతోంది. అప్పుడు 30వేలకు, 3లక్షలకు ఎకరం అమ్ముకునేవారు. ఒక్క మెడికల్ కాలేజీ లేని ఈ ప్రాంతానికి 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇదంతా పట్టుబడి, పిడికిలి బిగించి తెలంగాణ సాధిస్తే జరిగింది. ఇలానే భారతదేశం కూడా కనపడాలి. ఇక తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరువులు , వలసలు పోవడాలు ఉండవు. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారే కాని మనం బతుకుదెరువు కోసం ఎక్కడికీ పోం. వనపర్తి బైపాస్‌రోడ్డును ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలి. అందుకు 100 కోట్లు, 200 కోట్లు అయినా ఇస్తాం. త్వరగా పనులు పూర్తి చేయాలి. అభివృద్ది కోసం అద్భుతంగా కొట్లాడే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు మనకు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దీవెనలతో ఇంకా పురోగమించాలి. వెనుకబడిన పాలమూరు ప్రాంతం ఇప్పుడు పాలుగారుతోంది. ఇది పాలపొంగులా మారకూడదు.
దళితులకు అన్ని వర్గాల వారు అండగా ఉండాలి
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దళితులకు రూ.10లక్షలు ఇస్తున్నాం. తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. కిస్తీ కట్టాల్సిందిలేదు. బ్యాంకు లింకేజీ లేదు. నచ్చిన పని చేసుకుని మంచిగ బతకాలి. అన్ని వర్గాల ప్రజలు దళితులకు అండగా ఉండి ఈ పథకాన్ని విజయవంతం చేయాలి.
దేశంలో గోల్‌మాల్ గోవిందం గాళ్లు…
ఇప్పుడు దేశంలో గోల్‌మాల్ గోవిందం గాళ్లు ఉన్నరు. దేశాన్ని ఆగం పట్టిస్తున్నారు. మతపిచ్చి, కులపిచ్చి లేపి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మానవత్వాన్ని మంట గలుపుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణలో అలాంటి పరిస్థితులు రానివ్వను. కులం, మతం, జాతి బేధాలు లేకుండా దేశం అంతా ఒకేజాతిగా ముందుకు వెళ్లాలి. మీరంతా దీవించి పంపితే తెలంగాణను సాధించి… అభివృద్ధి చేసి చూపించా. తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందాలి. అందుకు దేశం కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మీరంతా దీవిస్తే చివరిదాకా, మడమతిప్పకుండా పోరాడుతా. దేశం కోసం పోరాడమని ఏ జిల్లాలో చూసినా ప్రజలు చైతన్యంతో దీవిస్తున్నారు. అవసరమైతే నా ప్రాణాలు దారపోసైనా కుల, మత, ప్రాంత భేదం లేని దేశాన్ని నిర్మిస్తా.
మతపిచ్చి గాళ్లను, బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలి.. మీ దీవెనలతో దేశం కోసం కొట్లాడుతా..
తెలంగాణ కోసం చివరిదాకా పోరాడాను. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. గిరిజన రిజర్వేషన్లను పెంచమని అసెంబ్లిdలో తీర్మాణం చేసి పంపిస్తే ప్రధాని మోదీదాన్ని కింద పెట్టుకుని కూర్చున్నాడు. వాల్మీకి బోయల ను మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఎస్టీ జాబితాలో చేర్చమంటే దాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. కేంద్రంలో తెలంగాణకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉం ది. వాళ్లకు ప్రజల డిమాండ్లు తెలియవు. మోదీ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోంది. ఈ పనికిమాలిన మతపిచ్చిగాళ్లను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేలాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలో విసిరికొట్టేందుకు అంతా సిద్ధంగా ఉండాలి. దేశంలో ఇప్పుడు సాగుతున్న కుల, మత పిచ్చి క్యాన్సర్ తెలంగాణలోకి రాకుండా చూసుకోవాలి. ఇందుకు ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఎక్కడికక్కడ బీజేపీ వాళ్లను నిలదీయాలి. దుర్మార్గమైన పద్దతిలో మత పిచ్చి లేపుతున్నారు. ఏచైతన్యంతో తెలంగాణను బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుంటున్నామో… అదే స్ఫూర్తితో భారతదేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకోవాలి. మీరంతా దీవిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా మడమ తిప్పకుండా బంగారు తెలంగాణ లాగా బంగారు భారతదేశాన్ని సాధిస్తాను. మీరందించిన దీవెనలతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో దేశ కోసం కొట్లాడేందుకు బయల్దేరుతున్నా.