Tuesday, November 19, 2024

Breaking: గోవా బీజేపీకి షాక్.. మంత్రి మైఖెల్ లోబో రాజీనామా..

గోవాలో బీజేపీకి వింత పరిస్థితి ఎదురవుతోంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన గోవా ఎన్నికల తొలి జాబితాలో ఇద్దరు బీజేపీ మినిస్టర్లకు ఫస్ట్ పేజ్ లోనే చోటు దక్కింది. ఇక ఇప్పుడు మరో మంత్రి బీజేపీకి ఇవ్వాల (సోమవారం) రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

గోవా మంత్రి మైఖేల్ లోబో అసెంబ్లీ ఎన్నికలకు నెల ముందు (ఈరోజు) రాజీనామా చేశారు. అంతేకాకుండా లోబో బీజేపీపై చేసిన కామెంట్ ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. “బీజేపీ ఇకపై సామాన్యుల పార్టీ కాదు” అని మైఖేల్ లోబో సీరియస్ కామెంట్ చేయడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయటపెట్టిందని చాలామంది అంటున్నారు.

కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలోకి చేరుతున్న తీరును తిప్పికొట్టి మైఖెల్ లోబో ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘నేను నా రెండు పదవులకు (మంత్రి, ఎమ్మెల్యే) రాజీనామా చేశాను.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాను.. బీజేపీకి కూడా రాజీనామా చేశా’’ అని రాష్ట్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ శాఖ ఇన్‌ఛార్జ్ మైఖేల్ లోబో విలేకరులతో అన్నారు.

‘‘బీజేపీ సామాన్య ప్రజల పార్టీ కాదని ఓటర్లు నాతో చెప్పారు’’ అని ఆయన తను పార్టీ వీడడాన్ని సమర్థించుకున్నారు. ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, కాంగ్రెస్‌లో చేరే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. నేను ఏ పార్టీలో చేరినా గరిష్ట సీట్లు గెలుపొందడం ఖాయం’’ అనానరు.

కాగా, మైఖేల్ లోబో ఈ మధ్య కాలంలో బీజేపీని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడున్న పార్టీ మాజీ సీఎం మనోహర్ పారికర్ నిర్మించిన పార్టీ కాదని చెబుతూ వస్తున్నారు. 2019లో మనోహర్ పారికర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్‌తో ఆయనకు బహిరంగంగానే విభేదాలు వచ్చాయి.

- Advertisement -

‘‘బీజేపీని భిన్నత్వం ఉన్న పార్టీ అని పిలుస్తారు. అది విభేదాలు ఉన్న పార్టీ కాదని ఈ మధ్యనే తెలిసింది. పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు పార్టీలో ప్రాముఖ్యత లేదు’’ అని లోబో గత నెలలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాగా, అతని మాటలతో మనోహర్ పారికర్‌కు సన్నిహితంగా ఉండే నేతలను పార్టీలో పక్కన పెడుతున్నారని లోబో అన్నారు.

మైఖెల్ లోబో రాజీనామాతో గోవాలోని బర్దేశ్‌లో పార్టీపై ప్రభావం చూపవచ్చు, ఆయన సొంత నియోజకవర్గం కలంగుటేతో సహా ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గనుంది. ఆదివారం కలంగుటే సమీపంలోని నియోజకవర్గమైన సాలిగావ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా లోబో కనిపించారు. అయితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలతో ఆ పార్టీలో కొంత అసంతృప్తిని రేకెత్తించింది.

అసలు విషయమేంటంటే.. అతను తన భార్య డెలీలాతో సహా అభ్యర్థుల జాబితాపై ప్రెషర్ తెచ్చాడని పరిశీలకులు భావిస్తున్నారు. సియోలిమ్ నియోజకవర్గం నుంచి ప్రచారంలో ఉన్న డెలిలాని పోటీకి దింపేందుకు బీజేపీ మొగ్గు చూపడం లేదని, అందుకే పార్టీని లోబో వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement