ఎన్నికలు అన్నాక హామీలు ఇవ్వడం మామూలు విషయమే. అయితే ఓ పార్టీ నేతలు ఏకంగా తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని బాండ్ పేపర్ పై సంతకాలు పెట్టడం విశేషం. తమ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే తప్పకుండా హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గోవాలో ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు లీగల్ అఫిడవిట్ పై సంతకాలు చేశారు. హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. అలాగే పార్టీకి విధేయుడిగా ఉంటామంటూ ప్రమాణం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము గెలిస్తే నిజాయితీగా పనిచేస్తామని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులందరూ నిజాయితీపరులే అని అన్నారు. అయినప్పటికీ గోవా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ అఫిడవిట్‌పై సంతకం చేయించి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మా అభ్యర్థులందరూ నిజాయితీపరులు, అయితే ఈ అభ్యర్థులు నిజాయితీపరులు అని ఓటర్లకు భరోసా ఇవ్వడానికి ఈ అఫిడవిట్ అవసరం అన్నారు. ఈ అఫిడవిట్‌ల కాపీలను ఓటర్లకు అందుబాటులో ఉంచుతామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
విశ్వాసాన్ని ఉల్లంఘిస్తే వారిపై తర్వాత కేసు ఓటర్లు నమోదు చేయవచ్చని ఆయన చెప్పారు. మా అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి సంతకం చేసిన అఫిడవిట్ జిరాక్స్ కాపీ లను పంపుతారు. ఇలా చేయడం వల్ల మా అభ్యర్థులు అఫిడవిట్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై విశ్వాస ఉల్లంఘన కేసును నమోదు చేసే హక్కును మేము ఓటర్లకు ఇస్తున్నామని చెప్పారు. విమానాశ్రయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. గోవాకు ఈ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. గోవా ప్రజలు తమకు ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని వాగ్దానం చేసిన ఆప్‌కి మద్దతు ఇవ్వడం ఒక ఎంపిక. లేదా బీజేపీకి నేరుగా మద్దతు ఇవ్వడం మరొక ఎంపిక. గత ఎన్నికల్లో గోవా ప్రజలు బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయి కాంగ్రెస్ ను ఎంచుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను నిరాశపరిచారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..