దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అనూహ్యంగా బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. మనోహర్ పారికర్ నాయకుడి కుమారుడు బీజేపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ఉత్పల్ పారికర్ రాజీనామా నిర్ణయాన్ని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్వాగతించారు. ఆ నిర్ణయం సరైనదే అని అన్నారు. ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేసి, స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు రౌత్ స్పందించారు. పనాజీలో నిజాయితీ, క్యారెక్టర్ కు మధ్య పోరాటం జరగబోతోందని అన్నారు. ప్రతీ పార్టీ ఉత్పల్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయన సొంతంగా పోటీ చేస్తే ఉత్పలపై వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో సహా అన్ని బీజేపీయేతర పార్టీలను ఆయన గతంలోనే కోరారు. గోవాలోని పనాజీ నియోజకవర్గం నుంచి మనోహర్ పారికర్ రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని ఉత్పల్ చాలా కాలం కోరుకుంటున్నారు. అయితే ఆ స్థానాన్ని అతడికి ఇవ్వడానికి బీజేపీ తిరస్కరించింది.
ఆ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో బాబుష్ మాన్‌సెరేట్ ను ఎంపిక చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ ఉన్నారు. ఈ స్థానంపై వివాదం నెలకొనడంతో అన్ని పార్టీలు ఉత్పల్ కు మద్దతుగా నిలబడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో స్పందించారు. ఉత్పల్ తమ పార్టీలో చేరితే ఆయనకు పనాజీ సీటు ఇస్తామని చెప్పారు. పారికర్ కుటుంబంతో కూడా బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలభిస్తోందని అన్నారు. దీని వల్ల గోవా ప్రజలు చాలా బాధ పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా ఉత్పల్ పారికర్ మీడియాతో మాట్లాడారు. తాను అధికారం కోసం, ఏ పదవి కోసం పోరాడటం లేదని అన్నారు. తన తండ్రి విలువల కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. బీజేపీ పాత కార్యకర్తలు తన వెంట ఉంటారని ఆశిస్తున్నాని తెలిపారు. గతంలో, ఇప్పుడు బీజేపీని ఒప్పించడానికి అన్ని విధాల ప్రయత్నించానని అన్నారు. కానీ పనాజీ టిక్కెట్ తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీజేపీ పనాజీ సీటు తప్పా.. రాష్ట్రంలోని అన్ని సీట్లు ఇస్తానని చెప్పింది. ఇక రాజకీయ జీవితాన్ని పనాజీ ప్రజలు నిర్ణయిస్తారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..