Sunday, November 24, 2024

ఇకపై విద్యాసంస్థలకు స్టేట్‌ ర్యాంకింగ్స్‌.. డిగ్రీ, ఇంజనీరింగ్‌, వర్సిటీలకు ఇచ్చేలా నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జాతీయ స్థాయిలో విద్యాసంస్థలకు ఇచ్చే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌( నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకిగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకింగ్‌ తరహాలోనే ఇక నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సైతం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులను ఇవ్వనున్నారు. హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తుగా తెలంగాణలోని డిగ్రీ, ఇంజనీరింగ్‌, యూనివర్సిటీలకు ర్యాంకింగ్‌లను ఇచ్చి ఆ తర్వాత ఫార్మసీ, ఇతర వృత్తి విద్యాకాలేజీలకు కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

న్యాక్‌ అక్రిడేషన్‌ను పొందడంలో వెనుకబడిన కాలేజీలను సైతం ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఉత్తమ ఫలితాలను కనబర్చే విద్యా సంస్థలకు రాష్ట్ర స్థాయిలో ర్యాంకింగ్‌ను ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కర్ణాటక, కేరళ తదితర కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అక్కడి విద్యాసంస్థలకు ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న నూతన విధానంతోపాటు, పలువురు నిపుణులతో చర్చించి దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు జాతీయ స్థాయిలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లను కేంద్రం ప్రకటిస్తుంది.

ఆన్‌లైన్‌ విధానం…
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో కళాశాలల మార్పిడి, కోర్సుల కన్వర్షన్‌, కళాశాలల అఫిలియేషన్‌(గుర్తింపు) ప్రక్రియ సాగుతోంది. అయితే ప్రస్తుతం మ్యాన్‌వల్‌లో ఈ తతంగమంతా సాగుతోంది. దీన్ని పారదర్శకంగా నిర్వహించేలా ఇక నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. కళాశాల అనుమతులు, సీట్ల మార్పిడి, కోర్సుల కన్వర్షన్‌ తదితర అంశాల్లో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇకపై కాలేజీ మార్పిడి, కోర్సుల కన్వర్షన్‌, అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనే వారు ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి రాకుండానే ఆన్‌లైన్‌లో నేరుగా చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

దీంతో పాటు విద్యార్థులను పరిశోధనల్లో ప్రోత్సహించేలా ఒక రీసెర్చ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పీజీ స్థాయిలో చదివే విద్యార్థులను సరికొత్త ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నారు. ఇదిలా ఉంటే ప్రతి నాలుగు నెలలకోసారి జరగాల్సిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అధికారులు బుధవారం నిర్వహించారు. అప్పట్లో జరిగిన పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించినట్లు తెలిసింది. ప్రమోషన్లు, వర్సిటీల్లో నియామకాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నట్లుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement