Wednesday, November 20, 2024

ద‌త్త‌త విష‌యంలో అమ్మాయిల‌కే ప్రాధాన్యం – సెల‌బ్రిటీస్ కూడా

పాత రోజుల్లో అయితే అబ్బాయే పుట్టాల‌ని కోరుకునేవారు. త‌మ వార‌సుడ‌ని, ఇంటి పేరు నిల‌బెడ‌తాడ‌ని బాగా న‌మ్మేవారు. కానీ కాలం మారుతుంది. దాంతో పాటే అబ్బాయి, అమ్మాయిల‌ప‌ట్ల తేడా కూడా త‌గ్గుతోంది. ఇప్పుడు కంటే కూతురినే క‌నాల‌నే రోజులు వ‌చ్చేశాయి. ఆడ‌పిల్ల‌ల్ని ఆ ఇంటి మ‌హాల‌క్ష్మి అనుకుంటారు చాలా మంది త‌ల్లిదండ్రులు. అయితే ద‌త్త‌త తీసుకునేవారు కూడా ఎక్కువ‌గా ఆడ‌పిల్ల‌ల‌నే తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారట‌. పిల్ల‌లు క‌ల‌గ‌ని వారు త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు దూర‌మైన వారిని ద‌త్త‌త‌గా తీసుకుంటార‌నే విష‌యం తెలిసిందే. అయితే ఆ ద‌త్త‌త‌గా అమ్మాయిలే కావాల‌ని కోరుకునేవారే ఎక్కువ‌ని మ‌హిళా శిశు సంక్షేమ అధికారులు వెల్ల‌డించారు.

దత్తత పేరుతో పిల్లలను తీసుకెళ్లిన తర్వాత వారిపై అధికారుల పర్యవేక్షణ రెండేళ్లపాటు ఉంటుంది. ఇబ్బంది పెడితే, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తిరిగి వెనక్కి తీసేసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో దత్తత కోసం వేచి చూస్తున్న దరఖాస్తులు 9,000 వరకు ఉన్నాయట‌. ప్రమాదాల కారణంగా తమ పిల్లలను కోల్పోయిన వారు, సంతాన భాగ్యం లేని వారు, ఆ భాగ్యం ఉన్నా అనాథలను అక్కున చేర్చుకోవాలన్న పెద్ద మనుసున్నవారు ఉంటున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక దరఖాస్తుల్లో ఆడపిల్లలే కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారట. కాకపోతే ఆరోగ్యవంతులైన పిల్లలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, విదేశీయులు వైకల్యం ఉన్న వారినీ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం చేయించేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తుండడం సంతోషక‌ర విష‌యం.

తెలంగాణలో పెళ్లయిన రెండేళ్లు నిండిన తర్వాతే దంపతులు దత్తత కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని కేంద్రీయ దత్తత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను సమీక్షించిన తర్వాతే అధికారులు ఏ విషయాన్నీ తేలుస్తారు. ఇందుకు సంబంధించి cara.nic.in పోర్టల్ ను చూడొచ్చు. ఆరోగ్యంతోపాటు, ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. దత్తత తీసుకునే వారికి ప్రాణాంతక వ్యాధులు ఉండకూడదు. ఒంటరి మహిళ అయితే ఆడశిశువును దత్తత తీసుకెళ్లొచ్చు. ముగ్గురు సంతానం ఉన్న వారికి దత్తత ఇవ్వరు. ఇక ఎంతో మంది సెల‌బ్రిటీలు కూడా ఆడ‌పిల్ల‌ల్నే ద‌త్త‌త తీసుకున్నారు. సుస్మితాసేన్ ద‌గ్గ‌ర నుంచి స‌న్నీలియోన్ వ‌ర‌కు ఆడ‌పిల్ల‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement