కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ఇక సామాజిక సేవలకే పరిమితం అవుతారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు పరిశీలకులు. ఆజాద్ కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసి, సామాజిక కార్యక్రమాలకు పరిమితం అవుతారని ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమైపోతుంది. ఈ విషయాన్ని ఆయనే పరోక్షంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే అన్యాపదేశంగా ఆజాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసి, సామాజిక సేవలో నిమగ్నమయ్యానని సడెన్‌గా మీకు తెలిస్తే.. మీరు ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంటూ గులాంనబీ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ జమ్మూలో జరిగిన అన్ని ఘటనలకూ పాకిస్తాన్ ఉగ్రవాదులే బాధ్యులని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పాక్ ఉగ్రవాదుల వల్ల హిందువులు, కశ్మీరీ పండితులు, కశ్మీర్ ముస్లింలు.. ఇలా అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. జమ్మూలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కులం, మతంతో సహా ఇతరత్రా అంశాల మీద సమాజాన్ని విభజించాలని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటూనే ఉంటాయన్నారు.