– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇటీవల సరైన విచారణ లేకుండా జారీ చేసిన వేలాది జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను చెల్లుబాటు కాకుండా చేసింది. మెహిదీపట్నం, చార్మినార్, ఫలక్‌నుమా, బేగంపేట, సికింద్రాబాద్ సర్కిళ్లలో ఇట్లాంటి సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున జారీ అయ్యాయి. మీ సేవా కేంద్రాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వెరిఫికేషన్ లేకుండానే పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పుడు రద్దు చేసిన 27000 GHMC జనన, 4000 మరణ ధ్రువీకరణ పత్రాలు మార్చి, డిసెంబర్ 2022 మధ్య జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రజలు జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాల కోసం బ్రోకర్‌లను సంప్రదించి, తండ్రి, తల్లి పేరు, పుట్టిన/మరణ తేదీని అందించి రూ. 2500 నుండి 3000 వరకు చెల్లిస్తున్నారు. ఇలా బ్రోకర్ల నుంచి తప్పుడు విధానంలో సర్టిఫికెట్లు పొందుతున్నారు.
ఆన్‌లైన్‌లో జనన రికార్డును ఎలా తనిఖీ చేయాలి..
- ఇలాంటి తప్పుడు సర్టిఫికెట్లు మెహిదీపట్నంలో పెద్దఎత్తున దొరికాయి. సర్కిల్‌లో 5,877 జీహెచ్‌ఎంసీ జనన, 240 మరణ ధ్రువీకరణ పత్రాలు నకిలీవని తేలింది.
- చార్మినార్ సర్కిల్‌లో 3,949 జనన, 249 మరణ ధ్రువీకరణ పత్రాలు నకిలీవి కాగా, చార్మినార్ సర్కిల్‌లో 1,839 జనన, 220 మరణ ధ్రువీకరణ పత్రాలు నకిలీవిగా గుర్తించారు.
ఆన్‌లైన్‌లో తమ బర్త్ రికార్డ్ ను చెక్ చేసుకోవాలనుకునే వారు GHMC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పుట్టిన తేదీతో పాటు ప్రాథమిక వివరాలను నమోదు చేయవచ్చు. జనన రికార్డును ధ్రువీకరించిన తర్వాత ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా ఏదైనా మీ సేవా కేంద్రాల నుండి సర్టిఫికేట్లను పొందే అవకాశం ఉంటుంది. కానీ, బ్రోకర్ల ద్వారా డబ్బులు చెల్లించి పొందే సర్టిఫికెట్లతో ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.