డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత కిదాంబీ శ్రీకాంత్‌లు.. జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో.. ఇద్దరూ తొలి రౌండ్లో విజయం సాధించి.. రెండో రౌండ్లోకి ప్రవేశించారు. టైటిల్ గెలిచిన వారికి 1,80,000 డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుంది. ఏడో సీడ్ క్రీడాకారిణి అయిన పీవీ సింధు.. థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ను 21-8, 21-7 పాయింట్ల తేడాతో ఓడించింది. రెండు వరుస సెట్స్‌లో బుసానన్ను పీవీ సింధు మట్టికరిపించి సునాయస విజయాన్ని అందుకుంది. అదేవిధంగా పురుషుల సింగిల్స్ విభాగంలో.. కిదాంబి శ్రీకాంత్, ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 39వ ర్యాంకు క్రీడాకారుడు లివర్డేజ్ను 21-10, 13-21, 21-7 పాయింట్ల తేడాతో ఓడించారు. ఇరువురి మధ్య 48 నిమిషాల పాటు పోరు కొనసాగింది.
బుసానన్‌పై 15వ విజయం..
ప్రపంచ నెంబర్ 11వ క్రీడాకారిణి అయిన థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై పీవీ సింధుకు ఇది 15వ విజయం. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన సింధు.. రెండో రౌండ్లో స్పెయిన్‌కు చెందిన బీట్రిజ్ కొర్రల్స్తో లేదా చైనాకు చెందిన జాంగ్ యి మ్యాన్‌తో తలపడనుంది. ప్రపంచ 11వ నెంబర్ ఆటగాడైన కిదాంబి శ్రీకాంత్, చైనా ఆటగాడు లు గువాంగ్తో రెండో రౌండ్లో తలపడనున్నాడు. కిదాంబి శ్రీకాంత్ జనవరిలో కరోనా బారినపడటంతో.. ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీకి దూరం అయ్యాడు. భారత్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సాయి ప్రతీక్, ఎన్ సిక్కిరెడ్డి తమ ప్రారంభ మ్యాచ్‌లో టాప్ సీడ్లు డెచాపోల్ పువారానుక్రో, థాయ్‌లాండ్‌కు చెందిన సప్పీరీ తైరత్తనాచాయ్లపై 19-21, 8-21 పాయింట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.
సింధు, శ్రీకాంత్ గట్టి పోటీ..
పీవీ సింధు, తన ప్రత్యర్థి బుసానన్‌పై భిన్నమైన ఆటతీరును కనబర్చింది. సుమారు 32 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన అతి కొద్ది సమయంలోనే.. ప్రత్యర్థిపై 11-4 పాయింట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో తొలి సెట్‌ను 21-8 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత రెండో సెట్లో బుసానన్ గట్టి పోటీ ఇచ్చింది. ఇరువురి మధ్య పాయింట్ల విషయంలో చాలా కొద్దిపాటి తేడా ఉండింది. 7-5తో సింధుకు బుసానన్ గట్టి పోటీ ఇచ్చింది. ఆ తరువాత కూడా.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో చివరికి 21-7 పాయింట్ల తేడాతో రెండో సెట్‌ను గెలుపొందింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్, ప్రత్యర్థితో ఆరంభంలో 6-6 పాయింట్లతో హోరాహోరీగా తలపడ్డాడు. ఆ తరువాత జోరు పెంచిన శ్రీకాంత్, 21-10 పాయింట్ల తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో 13-21 పాయింట్ల తేడాతో కిదాంబి ఓడిపోయాడు. చివరికి మూడో సెట్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 21-7 పాయింట్ల తేడాతో మూడో సెట్‌ను కిదాంబి సొంతం చేసుకోవడంతో గెలుపు లాంఛనమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..