Saturday, November 23, 2024

జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3

మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020 -21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతంగా నమోదైందని జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. దాదాపు నలభై ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్‌ స్థాయికి పడిపోయింది. 1979-80 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 5.2 శాతంగా నమోదైన తర్వాత మళ్లీ ఈ స్థాయిలకు పడిపోవటం ఇదే మొదటిసారి.

2019-20లో వృద్ధి రేటు 4 శాతంగా ఉంది. లాక్‌డౌన్ల ఎత్తివేతతో గత ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు కావడం కలిసివచ్చింది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అనుకున్న స్థాయిలో పతనం కాలేదు. అక్టోబరు -డిసెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 0.5 శాతంగా ఉంది. కొవిడ్‌ కారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.5 నుంచి 9 శాతం వరకు ఉండొచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సహా పలు సంస్థలు అంచనా వేశాయి. అయితే అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement