నేషనలిస్ట్ కాంగ్రెస్ నేత శరద్ పవార్ ని కలిశారు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ. ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి అదానీ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు శరద్ పవార్, గౌతమ్ అదానీల సమావేశం కొనసాగింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు తాను వ్యతిరేకం కాదని.. అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని శరద్ పవార్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శరద్ పవార్ నివాసానికి అదానీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది.
దీంతో అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. పవార్ మాత్రం సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామం శరద్ పవార్ తోటి ప్రతిపక్ష నాయకులను సైతం ఆశ్యర్యపరిచింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించిన పవార్.. అదానీ గ్రూప్‌కు మద్దతుగా నిలిచారు. ఇది వ్యాపార సంస్థ లక్ష్యంగా ఉందని, హిండెన్‌బర్గ్ పూర్వాపరాల గురించి తనకు తెలియదని చెప్పారు. తద్వారా.. వినాయక్ దామోదర్ సావర్కర్ (వీడీ సావర్కర్), అదానీ గ్రూపుపై విమర్శలు వంటి విషయాల్లో పవార్ కాంగ్రెస్ కంటే భిన్నమైన మార్గాన్ని అనుసరించారు. కాగా ఇప్పుడు వీరిద్దరి మీటింగ్ ప్రాధాన్యతని సంతరించుకుంది.