Monday, November 25, 2024

గ‌చ్చిబౌలి – కొండాపూర్ రోడ్డు బ్లాక్ – 90 రోజుల పాటు ట్రాఫిక్ మ‌ళ్లింపు

హైద‌రాబాద్ – గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌ వరకు కొత్త ఫ్లైవోవర్‌ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ నాయక్‌ వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీ హర్షవర్ధన్‌ పూర్తి వివరాలు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శిల్పాలేఅవుట్‌ ఫ్లైవోవర్‌ రెండోదశ నిర్మాణ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లే రహదారిపై ఈనెల 13వ తేదీ నుంచి 90 రోజుల పాటు వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌ టు కొండాపూర్‌ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ మార్గాల‌లోనే వెళ్లాలి….

గచ్చిబౌలి ఔటర్‌ నుంచి కొండాపూర్‌ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి శిల్పా లేఅవుట్‌ ఫ్లైవోవర్‌ వద్ద దారి మళ్లించి, మీనాక్షి టవర్స్‌, డిలైట్‌, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్‌ రహదారి మీదుగా కొత్తగూడ ఫ్లైవోవర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌ మీదుగా అనుమతిస్తారు.
లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద దారి మళ్లించి, డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌, రాడిసన్‌ హోటల్‌ మీదుగా కొండాపూర్‌ వైపు అనుమతిస్తారు.
ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లే వాహనదారులు, ట్రిపుల్‌ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద యూ టర్న్‌ తీసుకొని గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నుంచి డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌, రాడిసన్‌ హోటల్‌, కొండాపూర్‌ మీదుగా ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లాలి.
టోలిచౌకి ప్రాంతం నుంచి ఆల్విన్‌ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని మైండ్‌స్పేస్‌, సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌ మీదుగా హైటెక్స్‌ జంక్షన్‌ కొత్తగూడ, కొండాపూర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
గచ్చిబౌలి టెలికాంనగర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి జంక్షన్‌ ఫ్లైవోవర్‌ కింద యూ టర్న్‌ తీసుకొని శిల్పా లేఅవుట్‌ ైఫ్లైవోవర్‌, మీనాక్షి టవర్స్‌, డిలైట్‌, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్‌ మీదుగా కొత్తగూడ, కొండాపూర్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
ఆల్విన్‌ కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొత్తగూడ జంక్షన్‌ నుంచి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని హైటెక్స్‌ రోడ్‌, సైబర్‌టవర్స్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, శిల్పా లేఅవుట్‌ ఫ్లైవోవర్‌ మీదుగా గచ్చిబౌలి వెళ్లాల్సి ఉంటుంది.
ఆల్విన్‌కాలనీ జంక్షన్‌ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని శ్రీరాంనగర్‌ కాలనీ, మజీద్‌బండా, హెచ్‌సీయూ డిపో మీదుగా లింగంపల్లి వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement