Friday, November 22, 2024

నిన్నటి వరకు సహచరులు… నేడు ప్రత్యర్థులు!

తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి ఈటలను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. నిన్నటి వరకు మంత్రి వర్గంలో ఉన్న సహచరులే… ఇప్పుడు ప్రత్యర్థుల్లా మారి ఒకరిపై ఒకరు విమర్శలతో తలపడుతున్నారు. ఇన్ని రోజులు మనసులోనే దాచుకున్న ఎన్నో రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టుకుంటున్నారు. మంత్రులు ఎవరూ సంతృప్తిగా లేరన్న మంత్రి ఈటల వ్యాఖ్యలు మంత్రి గంగుల ఖండించారు. ఈటలకు సంబంధించి పలు కీలక విషయాలను బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈటల కూడా ఘాటుగానే స్పందించారు. గంగుల గతంలో కేసీఆర్​పై చేసిన కీలక వ్యాఖ్యలను బహిరంగంగా వెల్లడించారు. ఈట‌ల రాజేంద‌ర్ ఒక మేక‌వ‌న్నె పులి అని, బ‌ల‌హీన వ‌ర్గాల ముసుగులో ఉన్న‌ పెద్ద దొర అని ఆరోపించారు. ఆయ‌న హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైద‌రాబాద్‌కు వ‌స్తే ఓసీ అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్  వ్యాఖ్యానించారు. ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ముదిరాజ్‌ల‌ను ఎందుకు ద‌గ్గ‌ర‌కు తీయ‌లేదు? అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌శ్నించారు.  ఈట‌ల రాజేంద‌ర్ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తనపై మంత్రులు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఈటల… తన గురించి తెలిసి కూడా ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో చాలా సార్లు తన వద్దే అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. గతంలో ఓ సమస్యలపై సీఎంతో మాట్లాడేందుకు ప్రగతి భవన్ కు వెళితే.. మంత్రి అయిన తనపాటు గంగుల కమలాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలను అనుమతించలేదని, అప్పుడు ఇంత అహంకారం ఉంటుందా? ఇలాంటి అవమానం జరిగితే కరీంనగర్ నుంచి మరో ఉద్యమం వస్తుందని గంగుల కమలాకర్ చెప్పిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. ఇలాంటి సంఘనలు చాలా ఉన్నాయని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఏర్పడినప్పుడు కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కలేదని, ఆ సమయంలో కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తికి గురైయ్యారని అన్నారు. అయితే, ఇన్ని రోజులు మనసులోనే దాచుకున్న ఎన్నో రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయంతో పాటు కేబినెట్ నిర్ణయాల విషయంలో కూడా కీలక భూమిక పోషించిన ఈటలను ఇప్పుడు సీఎం కేసీఆర్ పక్కనపెట్టారు. ఈటలను టెక్ పెట్టేందుకే గంగులకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ఇప్పుడు కీలక భూమిక పోషిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ప్రతి విషయంలోనూ గంగుల కమలాకర్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామం ఈటల వర్గీయులకు మింగుడుపడకుండా చేస్తోంది. మరోవైపు  కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన బోయినలపల్లి వినోద్ కుమార్ ఈటలను టార్గెట్ చేయడం గమనార్హం.  

Advertisement

తాజా వార్తలు

Advertisement