Tuesday, November 26, 2024

కేంద్రం తీరుతో రైతాంగానికి నష్టం.. తాడోపేడో తేల్చుకొని వస్తాం

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పేరుతో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకునేందుకు మంత్రుల బృందం సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, రేపు కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ,సంబంధిత అధికారులను కలుస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి దాన్యం మొత్తం కొనుగోలు చేయాలని,ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకు ఎందుకు పెడుతున్నారన్నారు.

వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ ఉండాలనీ,రైతులు వేసిన పంటలు అన్ని కూడా కేంద్రం కొనాలన్నారు. పంజాబ్ లో కొంటావు ఎందుకు తెలంగాణ రైతులు పండిస్తే ఎందుకు కొనరని, పంజాబ్ లో పండించిన గోధుమలు కొంటావు కానీ మేము పండించిన వరి దాన్యం ఎందుకు కొనరని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ పరిచయం చేసింది ఈ FCIనే కదా? అని అడిగారు. ఎందుకు మరి ఈ బాయిల్డ్ రైస్ కొనరని నిలదీశారు. గోధుమలు పండిస్తే పిండి చేసి ఇవ్వడం లేదుగా, పత్తి పండిస్తే బేల్ చేసి ఇవ్వడం లేదుగా మరి వడ్లు ఎందుకు బియ్యం చేసి ఇవ్వాలన్నారు.

తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకొని వస్తాం అని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోతే ఎం చేయాలో తమ సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి గంగుల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement