వారందరూ ఒకే ఊరుకు చెందినవారు. అందరూ 25 సంవత్సరాల్లోపు యువకులే. సునాయాసంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. శివారు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను టార్గెట్ చేసుకున్నారు. పక్కా రెక్కీతో రాత్రి సమయాల్లో మద్యం దుకాణాల షెటర్లు తొలగించడం, దుకాణం పైభాగంలోని ఇనుమ రేకులను తొలగించడం, లోనికి ప్రవేశించి దొరికినకాడికి నగదును దోచుకుని పరారయ్యేవారు. అడ్డొచ్చిన వాచ్‌మెన్‌లపై దాడులకు పాల్పడడం, మరీ ప్రతిఘటిస్తే వాచ్‌మెన్‌లను హతమా ర్చడం, దోపిడీలకు పాల్పడడం ప్రవృత్తిగా మార్చుకున్నారు.
నెల్లూరు క్రైం, (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో కేవలం మద్యం దుకాణాల్లో మాత్రమే 45 నేరాలకు పాల్పడ్డ ముఠాని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయాత్నాలు చేస్తున్నారు. సుమారు రూ.95 లక్షలు నగదును చోరీ చేసి రెండు సంవత్సరాలుగా పోలీసుల కళ్లగప్పి జల్సాలకు పాల్పడుతోంది ఈ ముఠా. 6 జిల్లాల పోలీసుల వీరి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్. విజయరావు నేతృత్వంలో ఈ ముఠాలోని 7 మంది సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల 70 వేలు విలువ చేసే 5 మోటారు సైకిళ్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ మద్యం దుకాణాల్లో చోరీల ముఠాకు సంబంధించి ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీ.ఎం త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ విజయరావు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో గడిచిన రెండేళ్లలో శివారు ప్రాంతాల్లో ఉన్న 45 మద్యం దుకాణాల్లో గుర్తుతెలియని దుండగులు వాచ్‌మెన్లపై దాడులకు పాల్పడి దుకాణాల్లో ఉన్న సుమారు రూ.95 లక్షలు నగదును చోరీ చేసుకుని వెళ్లడమే కాకుండా విజయనగరం, కృష్ణా జిల్లా జి. కొండూరు ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు వాచ్‌మెన్లు హత్యకు గురయ్యారు. దీంతో 6 జిల్లాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందుకూరుపేటలో జరిగిన చోరీతో .. ముఠా గుట్టురట్టు
గత ఏడాది మార్చి 30వ తేదీ ఇందుకూరుపేట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు షెటర్ తొలగించి నగదు చోరీకి పాల్పడ్డారు. జిల్లా ఎస్పీ సీహెచ్. విజయరావు ఆదేశాలతో సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా, మరికొంత మంది పోలీసు అధికారులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రత్యేక బృందం ఈ చోరీ కేసుల్లో నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చోరీలకు పాల్పడేది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన యువకులని పోలీసులు గుర్తించారు. మొత్తం 14 మంది ముఠా సభ్యులు కలిసి ఈ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు.
పాత మద్యం దుకాణం క్యాషియరే సూత్రధారి.. శని, ఆదివారాల్లోనే చోరీలు
ప్రభుత్వ మద్యం దుకాణంలో గతంలో పనిచేసి మానివేసిన మహేష్ అనే పాత క్యాషియరే ఈ చోరీలకు సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సోమవారం నుండి ఆదివారం వరకు విక్రయాలు సాగగా వచ్చిన నగదును దుకాణంలోని లాకర్‌లోనే భద్రపరిచి సోమవారం నాడు నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఈ విషయం తెలిసిన క్యాషియర్ మహేష్ తన బంధువులు, స్నేహితుల ద్వారా పథకం రచించి శని, ఆదివారాల్లో మాత్రమే ఊరు శివారు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను టార్గెట్ చేసి షెటర్లు తొలగించడం, పైకప్పుకు ఉన్న రేకులను తొలగించి నగదు చోరీలకు పాల్పడేవారు. అడ్డొచ్చిన వాచ్‌మెన్‌లపై దాడులకు పాల్పడేవారు. ఈ నేపధ్యంలోనే విజయనగరం, కృష్ణా జిల్లాల్లో మద్యం దుకాణాల వద్ద కాపలాగా ఉన్న వాచ్‌మెన్లు ప్రతిఘటించడంతో ఈ ముఠా వారిని కూడా హతమార్చి నగదు దోపిడీకి పాల్పడి పరారయ్యారు.
7 మంది ముఠా సభ్యులు అరెస్టు .. పరారీలో మరో 7 మంది
మద్యం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డ ముఠా సభ్యులను గుర్తించిన సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న ప్రకాశం జిల్లా పీసీ మండలానికి చెందిన రాపూరు దుర్గారావు, మేకల మహేంద్ర, మేకల అనీల్‌కుమార్, అల్లూరు సువర్తయ్య, రాపూరు మల్లికార్జునలను ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం కొమరికకు వెళ్లే రోడ్డు వద్ద అరెస్టు చేసి మరో ఇరువురు మైనర్ బాలురులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.20,400 నగదు, రూ.2 లక్షల 50 వేలు విలువ చేసే ఐదు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ముఠా సభ్యులు నెల్లూరు జిల్లాలో 9 మద్యం దుకాణాలు, ప్రకాశం జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 14, పశ్చిమ గోదావరి 7, విజయనగరం జిల్లాలో 1 మద్యం దుకాణంలో చోరీలకు పాల్పడినట్లు, మొత్తం 45 కేసుల్లో ఈ ముఠా నిందితులని, ఈ ముఠాలోని మరో 7 మంది సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు.
పోలీసులకు అభినందనలు
రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో 45 మద్యం దుకాణాల్లో నగదు చోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేయడంలో ఎంతో కష్టపడి పనిచేసిన సీసీఎస్ పోలీసులను గుంటూరు రేంజ్ డీఐజీ సీ.ఎం త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ సీహెచ్. విజయరావులు ప్రత్యేకంగా అభినందించారు. సీసీఎస్ డీఎస్పీ ఎ. శివాజీరాజు, ఇన్‌స్పెక్టర్లు షేక్ బాజీజాన్ సైదా, జి. గంగాధర్, ఎస్సై సురేష్, ఏఎస్సై గిరిధర్‌రావు, సిబ్బంది జె. సురేష్‌బాబు, సీహెచ్ వెంకటేశ్వరావు, జీవి రమేష్, పి. సతీష్, ఆర్. హరీష్‌రెడ్డి, పీవీ సాయి ఆనంద్, షేక్ కరీముల్లా, టి. రాములను డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ విజయరావులు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు పి. వెంకటరత్నం, శ్రీనివాసరావు, డీఎస్పీలు ఎన్. కోటారెడ్డి, వై. హరనాధ్‌రెడ్డి, ఎండి అబ్దుల్ సుభాన్, ఎం. గాంధీ, ఇన్‌స్పెక్టర్లు పి. అక్కేశ్వరరావు, జగన్మోహన్, ఎం. మధుబాబు, షేక్. అన్వర్‌బాషా, కె. నరసింహారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.