Sunday, November 24, 2024

Breaking: గంగ‌మ్మ ఒడి చేరిన ఖైర‌తాబాద్ గ‌ణేశుడు.. క‌న్నుల‌పండువ‌గా శోభాయాత్ర‌

హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. తొమ్మిది రోజులు ఘ‌నంగా పూజ‌లు అందుకున్న పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మి గ‌ణ‌నాథుడికి గంట‌న్న‌ర పాటు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేశారు. ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. మ‌హా గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను చూసేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను చూసి పుల‌కించిపోయారు. గ‌ణ‌నాథుడికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాలు గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా నినాదాల‌తో మారుమోగాయి. ఖైర‌తాబాద్ నుంచి టెలిఫోన్ భ‌వ‌న్ మీదుగా హుస్సేన్ సాగ‌ర్ దాకా దాదాపు 6 గంట‌ల‌కు పైగా ఈ శోభాయాత్ర కొన‌సాగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టారు.

కాగా, 67 ఏళ్ల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న‌ 26 టైర్ల టస్కర్ వేహిక‌ల్‌లో మ‌హాగణపతిని తరలించారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్‌ పంచముఖ మహాగణప‌తి శోభాయాత్ర.. స‌న్‌షైన్ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుని నిమ‌జ్జ‌నోత్స‌వంతో ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement