– ప్రభన్యూస్, వాజేడు
గత ఏడాది మిర్చి పంటకు మంచి ధర పలకడంతో ఈ సారి కూడా రైతులు పెద్ద మొత్తంలో అదే పంట సాగుచేయడానికి రెడీ అయ్యారు. దీన్ని పసిగట్టిన విత్తన వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ఏడాది ముందుగానే మిర్చి విత్తనాలను బ్లాక్ చేశారు. సీజన్ ముంచుకురావడంతో ఇప్పుడు మిర్చీ విత్తనాలను అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు. 5000 రూపాయల నుండి 6000 వేల దాకా ఉన్న 341 మిర్చి విత్తనాల రేటును డబుల్ చేసి 12 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. అది కూడా చిన్న సన్నకారు రైతులకు కాకుండా రాజకీయ నేతలకు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు, ప్రజాప్రతినిధులకు, బడా భూస్వాములకు కేజీల కొద్ది ఇస్తూ చిన్న, సన్న కారు రైతులకు మాత్రం 341 విత్తనాలు ఇవ్వడంలేదని ఆరోపణలున్నాయి.
విత్తనాలు బ్లాక్.. కోట్లలో దోపిడీ..
మిర్చి విత్తనాలను బ్లాక్ చేసి కోట్ల రూపాయల్లో దందా కొనసాగిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ ఎందుకు పట్టించుకోవడంలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. పక్క జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని చర్ల , దుమ్ముగూడెం మండలాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్కడి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా విత్తనాలు అందేలా చర్యలు చేపట్టారు. కానీ, ములుగు జిల్లాలో మాత్రం అట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలుకుబడి ఉన్న వ్యక్తులకు, భూస్వాములకు, ప్రజా ప్రతినిధులకు కేజీల కొద్దీ విత్తనాలు ఎలాంటి రిసిప్ట్లు లేకుండా అమ్ముతున్నట్టు సమాచారం. దీంతో చిన్న సన్నకారు రైతులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణ టు మహారాష్ట్ర..
తెలంగాణ ప్రాంతంలోని మిర్చి విత్తనాల డిస్ట్రిబ్యూటర్లు. 3 4 1 విత్తనాలను మహారాష్ట్ర ప్రాంతానికి తరలించి ముందస్తుగానే విక్రయించడంతో ఇక్కడ 341 విత్తనాల కొరత ఏర్పడినట్లు సమాచారం . మహారాష్ట్ర ప్రాంతంలో అధిక ధరలకు విక్రయించి కోట్లాది రూపాయల సంపదను అర్జించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రాష్ట్రం నుండి మహారాష్ట్ర ప్రాంతానికి విత్తనాలు తరలించి అక్రమంగా విక్రయాలు జరుగుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు చలనం లేకపోవడం ఈ ప్రాంత రైతులు దురదృష్టకరంగా భావిస్తున్నారు.
341విత్తనాలు బ్లాక్ చేసి, వేరే విత్తనాలు అంటగడుతున్నారు..
341 విత్తనాలు బ్లాక్ చేసి, వేరే విత్తనాలు అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100, 200, 300 గ్రాముల విత్తనాలు కూడా దొరకని పరిస్థితి ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వేరే విత్తనాలు కొనాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్లో ఉన్న 341 విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.