Thursday, November 21, 2024

Big Story: ప్లాట్ల విక్రయాలకు ఫుల్ డిమాండ్‌.. రంగారెడ్డి జిల్లాలో 194.49కోట్లు

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు వాయువేగంగా పెరిగిపోతున్నాయి. చుట్టూరా 50 కిలోమీటర్ల పరిధిలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి…శివారు ప్రాంతాలు విస్తరిస్తుండటంతో ప్లాట్లకు మంచి డిమాండ్‌ నెలకొంది…రోజురోజుకు ధరలు పెరిగిపోతుండటంతో ఆలస్యం చేస్తే మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తపడుతున్నారు….అందులో ప్రభుత్వ సంస్థ హెచ్‌ిఎండీఎ అభివృద్ధి చేసిన ప్లాట్లు కావడంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. రంగారెడ్డి…..మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాట్లలో కొన్ని మినహా అన్నీ అమ్ముడుపోయాయి. జంట జిల్లాల పరిధిలో ప్రభుత్వానికి ఏకంగా రూ. 334.72కోట్ల మేర ఆదాయం సమకూరింది… మధ్యతరగతి వర్గాలనుండి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో మరింతమేర ప్లాట్లు అభివృద్ధి చేసే దిశగా హెచ్‌ఎండీఎ అడుగులు వేస్తోంది..

శివార్లు రోజురోజుకు భూముల ధరలు పెరుగుతున్నాయి. శివారు మండలాల్లో రియల్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. దీంతో వ్యవసాయ భూములు కాస్త ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. అవసరాల నిమిత్తం రైతులు భూములు అమ్ముకుంటున్నారు. వీరినుండి రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభజిస్తున్నారు. శివారు ప్రాంతాలు దాదాపుగా హైదరాబాద్‌లో కలిసిపోతున్నాయంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ సంస్థలు చేసిన ప్లాట్లకే డిమాండ్‌ జోరుగా ఉంటే ప్రభుత్వ సంస్థ చేసే ప్లాట్లకు ఎంత డిమాండ్‌ ఉంటుందో చెప్పనక్కరలేదు. తాజాగా హెచ్‌ఎండీఎ అభివృద్ధి చేసి అమ్మకాలు చేసిన ప్లాట్లకు ఊహించని డిమాండ్‌ వచ్చింది. మధ్యతరగతి వర్గాలను దృష్టిలోపెట్టుకుని ప్లాట్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరింత ధర పెరుగుతుందనే ధీమాతో తమ స్థాయికి మించి ప్లాట్లు కొనుగోలు చేశారు. 75శాతం మేర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఈ రెండు జిల్లాల పరిధిలో శివార్లలో డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. అందులో ప్రభుత్వ సంస్థలు ప్లాట్లు చేయడంతో జనాలు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు….

జంట జిల్లాల పరిధిలో రూ. 332.74కోట్ల ఆదాయం..
హైదరాబాద్‌ చుట్టూరా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా విస్తరించి ఉన్నాయి. దీంతో ఈ జంట జిల్లాల పరిధిలో ప్లాట్లకు డిమాండ్‌ ఎక్కువే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్ల విక్రయాల ద్వారా ఈ రెండు జిల్లాలనుండి దండిగా ఆదాయం సమకూరింది. రూ. 332.74కోట్లమేర ఆదాయం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో రూ. 194.49కోట్లమేర ఆదాయం సమకూరగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో రూ. 194.49కోట్లమేర ఆదాయం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 223 ప్లాట్లు వేలం వేయగా ఇందులో 229 ప్లాట్లు చకచక అమ్ముడుపోయాయి. ప్లాట్లకు 50వేల వరకు అత్యధిక ధర పలికింది. జిల్లాలో 27,908 సగటు ధరగా నిర్ణయించారు. హయత్‌నగర్‌ మండలం పరిధిలోని తొర్రుర్‌లో ప్లాట్ల అమ్మకాలు జరిపారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 101 ప్లాట్లకు

వేలం వేయగా ఇందులో 77 ప్లాట్లు హాట్‌కేకులుగా అమ్ముడుపోయాయి. ఇంకా 24 ప్లాట్లు అమ్ముడుపోవల్సి వచ్చింది. కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లి లో ప్లాట్ల ఏర్పాటు చేశారు. ఇక్కడ 38,500 అత్యధిక ధర నిర్ణయించగా సగటు ధర రూ. 30వేలు నిర్ణయించారు. ప్రస్తుతం విక్రయాలు చేసిన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావడంతో మధ్యతరగతి వర్గాలు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూర్చి పెట్టే జిల్లాల్లో జంట జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి. తాజా ప్లాట్ల అమ్మకాల్లో కూడా జంట జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పరిధిలో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.

నమ్మకం కుదిరింది..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంఛర్లు వేసి ప్లాట్లు విక్రయించే విషయంలో ఏదో ఒక సమస్యలు నెలకొంటున్నారు. అగ్రిమెంట్‌ చేసుకున్నప్పుడు ఒక ప్లాట్లు చూపించి రిజిస్ట్రేషన్‌ సమయంలో మరో ప్లాట్లు చూపిస్తున్న సంఘటనలు శివార్లలో వందల సంఖ్యలో ఉన్నాయి. అలా కొనుగోలు చేసి మోసపోయిన మధ్యతరగతి వర్గాల ప్రజలు చాలామంది ఉంటారు. కానీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు కావడం ఎలాంటి మోసం జరగదనే నమ్మకం కొనుగోలుదారుల్లో వచ్చింది. దీంతో వెనకా ముందు చూసుకోకుండా స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ వేలంలో పాల్గొని తమకు నచ్చిన ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది కావడంతో పూర్తి నమ్మకం ఏర్పడింది. భవిష్యత్తులో శివార్లలో ప్లాట్ల విక్రయాలకు ఢోకా లేదనే విషయం స్పష్టమైంది. దీంతో శివార్లలో మరిన్ని ప్లాట్లు అభివృద్ధి చేసి అమ్మకాలు చేసేందుకు హెచ్‌ఎండీఎ, రెవెన్యూ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. శివార్లలో ప్లాట్ల అమ్మకాలకు మంచి డిమాండ్‌ నెలకొనడంతో చాలా ప్రాంతాల్లో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.మొత్తం మీద ప్లాట్ల విక్రయాల ద్వారా జంట జిల్లాలనుండి దండిగా ఆదాయం సమకూరింది. రానున్న రోజుల్లో మరింతమేర ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement