Friday, November 22, 2024

Big Story: చిల్డ్‌ బీర్ల‌కు ఫుల్ డిమాండ్‌.. మండే ఎండ‌ల‌కు మ‌స్త్ చిల్ అవుతున్న‌రు!

ఏప్రిల్‌లో ఎండ‌లు మంట‌పుట్టిస్తున్నాయి. ప‌గ‌టిపూట 39 నుంచి 44 డిగ్రీల‌కు టెంప‌రేచ‌ర్ చేరుతోంది.. ప‌గ‌టి వేళ అడుగు బ‌య‌ట‌పెడ‌దామంటే కిందా, మీదా భ‌గ్గున మండిపోతోంది. ఇగో ఇట్లాంటి టైమ్‌లోనే చిల్‌గా ఉండాల‌ని కోరుకుంటున్నారు చాలామంది మ‌ద్యం ప్రియులు. చిల్డ్ బీర్ల‌తో చీర్స్ కొడుతూ తెగ చిల్ అవుతున్నరు. ఇట్లా ఈ ఎండాకాలం సీజ‌న్‌లో ఎన్న‌డూ లేనంత డిమాండ్ బీర్ల‌కు వ‌చ్చింది.

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో: ఎండలు ముదురుతున్న ఈ తరుణంలో చల్లటి బీర్లు తాగేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎండనుండి ఉపశమనం పొందేందుకు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండలు పెరిగినట్లే బీర్ల అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. సీజన్‌ కావడంతో ఏ వైన్స్‌లో చూసినా బీర్లే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. రానున్న మే మాసంలో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో బీర్ల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో మద్యం వ్యాపారులు బీర్లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మద్యం అమ్మకాలు చలికాలం, వర్షాకాలాల్లో ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి.. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. ఎండలు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాయి…కొద్దిసేపు బయటకు వెళ్లివస్తే చాలు గొంతు ఆపిపోయే పరిస్థితులు. రెగ్యూలర్‌గా మద్యం తాగే వాళ్లు ఎండలను తట్టుకోలేకపోతున్నారు…క్రమం తప్పకుండా తాగే మద్యం పక్కకు పెట్టి చిల్డ్‌ బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

సీజన్లను బట్టి మద్యం తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కువమంది మద్యం ప్రియులు బీర్లకు ప్రాధాన్యమిస్తున్నారు. జంట జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో బీర్ల అమ్మకాలు నెలనెల పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉంటుంది. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో కూడా ఆశించినమేర అమ్మకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 495 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో ఐదు ఎక్సైజ్‌ డివిజన్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో సరూర్‌నగర్‌, శంషాబాద్‌ డివిజన్లు ఉండగా మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ ఎక్సైజ్‌ డివిజన్లు ఉన్నాయి. వికారాబాద్‌ డివిజన్‌ ఉంది. నాలుగు డివిజన్ల పరిధిలో మద్యం దుకాణాలకు డిమాండ్‌ ఎక్కువే.

నవంబర్‌ మాసంలో మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 495 మద్యం దుకాణాలకు ఏకంగా 15,351 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ. 307కోట్లమేర ఆదాయం సమకూరింది. కేవలం దరఖాస్తుల ద్వారా రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయం వచ్చింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే. ఇక్కడ దుకాణాలు దక్కించుకునేందుకు పోటీ ఎక్కువగా ఉంటుంది. మద్యం అమ్మకాల్లో కూడా ఉమ్మడి రంగారెడ్డి హవా కొనసాగుతోంది. సీజన్‌ ఏదైనా అమ్మకాలు జోరుగానే కొనసాగుతాయి. ప్రస్తుత వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చల్లటి బీర్లు తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు చాలావరకు తగ్గిపోయాయి. మద్యం అమ్మకాలు పెరగాలంటే మరో నెలరోజులు ఓపిక పట్టాల్సిందే.

నెలనెల పెరుగుతున్న బీర్ల అమ్మకాలు..
ఎండలు పెరిగినట్లుగానే బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో రికార్డు స్థాయిల్లో బీర్ల అమ్మకాలు జరిగాయి. రానున్న మే మాసంలో రెండు మాసాల కంటే ఎక్కువగా బీర్ల అమ్మకాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్సైజ్‌ పోలీసులు కూడా అదే అంచనా వేస్తున్నారు. మార్చి మాసంలో రంగారెడ్డి జిల్లాలో 6.20లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. అమ్మకాల ద్వారా ఏకంగా రూ. 390కోట్లమేర ఆదాయం సమకూరింది. ఏప్పిల్‌ మాసంలో బీర్లఅమ్మకాలు పెరిగాయి. ఈ మాసంలో 7.60లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. దాదాపుగా 1.40లక్షల కేసులు అధికంగా విక్రయాలు జరిగాయి. ఈ మాసంలో ఇప్పటికే రూ. 399కోట్లమేర ఆదాయం వచ్చింది. మే మాసంలో ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో బీర్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో మార్చిలో 1.35లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ.80కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌ మాసంలో 1.54లక్షల కేసులకు పైగానే బీర్లు అమ్ముడుపోయాయి. రూ. 82కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది.

- Advertisement -

మే మాసంలో మరింతగా అమ్మకాలు..
మే మాసంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. అదే స్థాయిలో బీర్ల అమ్మకాలు ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు రెట్టింపుగా ఉంటాయి. మే మాసంలో కూడా అదే పరిస్థితిఉంటుంది. డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకుని మద్యం వ్యాపారులు ఎక్కువగా బీర్ల స్టాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. మే మాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అమ్మకాలు పెరిగే అవకాశాలు న్నాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాలతో పోలిస్తే మే మాసంలో మరింత మేర బీర్ల అమ్మకాలు పెరిగే ఛాన్స్‌ ఉంది. జూన్‌ మాసంలో వర్షాలు ప్రారంభమైన తరువాత మద్యం అమ్మకాల జోరు ప్రారంభం కానుంది. వానాకాలంలో బీర్ల అమ్మకాలు చాలావరకు తగ్గిపోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement