తెలంగాణ రాష్ట్రం వైద్య విద్యా హబ్‌గా ఆవిర్భవించే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా దాదాపు 16 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున ఏకంగా 2400 మెడికల్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాజలేజీతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.
ఈ 9 మెడికల్ కాలేజీల్లో కలిపి 1200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం14 కొత్త మెడకిల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా మరో 2 చోట్ల(కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రం)లో ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న 9, త్వరలో ఏర్పాటు చేయనున్న 16 మెడికల్ కాలేజీలను కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ యజమాషీలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం ఉన్న 9 మెడికల్ కాఏలజీల్లో 1640 సీట్లు, కొత్తగా ప్రకటించిన 16 మెడికల్ కాలేజీల్లో 2400 సీట్లను కలుపుకుంటే మొత్తం 4040 ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటాలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కొత్త మెడికల్ కాలేజీకి అనుబంధంగా 330 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
ఆసుపత్రుల్లోని బెడ్స్ ను పెంచటంతోపాటు ఇతర అవస్థాపనా సౌకర్యాలు కల్పించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా అప్‌గ్రేడ్ అయిన జిల్లా ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే పేద, సామాన్య రోగులకు అత్యాధునిక వైద్య సేవలు వారి సమీప ప్రాంతంలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు , వైద్య విద్యార్థులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. వైద్యం కోసం పేదలు ప్రయివేటుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏకంగా 80శాతం మేర తగ్గనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి మరీ నిధులను సమీకరించనున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ.500 కోట్ల దాకా ఖర్చు అవనుంది. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కార్పోరేషన్ ఏర్పాటును ప్రకటించే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును స్వాగతిస్తున్నాం: డా. పుట్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యరంగం గణనీయంగా మెరుగవుతోంది. అందులో భాగంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు నిర్ణయం విప్లవాత్మకమైనది. పేద, సామాన్య రోగులకు మెరుగైన ప్రభుత్వ వైద్య అందనుంది. ప్రయివేటులో వైద్యంతో అప్పులపాలవ్వాల్సిన పరిస్థితులు గణనీయంగా తగ్గుతాయి. ఎందరో పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వైద్య విద్య కోసం తెలంగాణకు రానున్నారు. వైద్య ఆరోగ్యరంగంలో ఎన్నో పరిశోధనలు జరిగేందుకు అవకాశం ఉంటుంది.