పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత భారత్ నుంచి పారిపోయి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అకస్మాత్తుగా అదృశ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. మెహుల్ చోక్సీ అదృశ్యంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని విజయ్ అగర్వాల్ తెలిపారు. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
అంటిగ్వాలోని ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అంటిగ్వా పోలీసులు.. చోక్సీ గురించి గాలిస్తున్నారు. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. అయితే అతడి జాడ మాత్రం తెలియరాలేదు.
కాగా, పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను సీబీఐ, ఈడీలు దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గీతాంజలి జ్యువెలర్ గ్రూప్ అధినేత అయిన మెహుల్ చోక్సీ కోసం సీబీఐ, ఈడీలు గాలిస్తున్నాయి. మొత్తం రూ.13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్ మోదీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతారు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి : కేసీఆర్