హై దరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులోనూ మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. జీ. శ్రీనివాసరావు బుధవారం ట్వీట్ చేశారు. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున వైరస్ కట్టడికి మాస్కు ధరించడం తప్పని సరి అని తేల్చారు.
తాజాగా 485 కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజూ 500కు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 485 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో తాజాగా 236 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరోవైపు కరోనా యాక్టివ్ కేసులు నాలుగువేలను దాటాయి. ప్రస్తుతం కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య తెలంగాణలో 4421గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్త్‌ంగా 27130 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 257 కేసులు నమోదు కాగా… మేడ్చల్ జిల్లాలో 37, రంగారెడ్డిలో 58, సంగారెడ్డిలో 73 కేసులు నమోదయ్యాయి.