Tuesday, November 19, 2024

ఇక‌పై గూగుల్ ఉద్యోగుల‌కు.. ఫ్రీ సౌక‌ర్యాలు లేవ్

ఖ‌ర్చులు త‌గ్గించుకునేంందుకు ప‌లు ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కంపెనీ ఉద్యోగుల‌కు ఇచ్చే ఫ్రీ సౌక‌ర్యాల‌ను తీసివేయ‌నుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పఠిస్తున్న గూగుల్ ఉచితాలన్నిటినీ తొలగించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు ఓ నోటీసు అందినట్టు బిజినెస్ ఇన్‌సైడర్‌ పత్రిక కథనంలో వెల్లడైంది. ఈ నోటీసులను సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రుత్ పొరాట్ స్వయంగా పంపించారట. గూగుల్ కార్యాలయం అంటే ముందుగా గుర్తొచ్చేది అక్కడి సౌకర్యాలే! అక్కడి సౌకర్యవంతమైన పని వాతావరణం మరెక్కడా ఉండదని గూగుల్‌లో పనిచేసిన వారు చెప్పే మాట.

కార్యాలయంలో ఉద్యోగులు సౌకర్యవంతంగా ఫీలయ్యేందుకు కంపెనీ అనేక ఉచితాలను అందిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తయారు చేసుకునేందుకు వీలుగా మైక్రో కిచెన్లు, ఉచిత లాండ్రీ సర్వీసులు, కంపెనీ స్వయంగా స్పాన్సర్ చేసే మధ్యాహ్న భోజనాలు.. అబ్బో ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. వీటిన్నిటికీ గూగుల్ త్వరలో ముగింపు పలకనుందని సమాచారం. ఈ ఉచితాలు తాలూకు నిధులను ఇతర ప్రాధాన్యాల వైపు మళ్లించడమే తమ లక్ష్యమని తన లేఖలో స్పష్టం చేశారట. అంతేకాకుండా.. కొత్త నియామకాలను కూడా తగ్గించామని, ప్రస్తుతమున్న ఉద్యోగులనే హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement