Thursday, November 21, 2024

లక్షల నుంచి కోట్ల దాకా.. డిమాండ్ పెరిగిన మద్యం షాపులు..

నల్గొండ, ప్రభన్యూస్ : మద్యం షాపుల కాలపరిమితి నేటితో ముగుస్తుంది.. 2021-23 రెండేళ్ళ కాలపరిమితికి టెండర్లు నిర్వహించారు.. లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు.. ఈ ప్రక్రియ ముగిసింది.. కొత్త షాపులు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడే అసలు తంతు మొదలైంది. లక్కీ లాటరీలో షాపులు దక్కించుకున్న వారు మద్యం షాపులను అమ్మకానికి పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని సగానికిపైగా షాపులు కొత్త వారికి రావడంతో గుడ్‌విల్‌కు అమ్ముకుంటున్నారు. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు షాపు అమ్మకాలనుబట్టి ధర పలుకుతుంది. ఎస్‌సి, ఎస్‌టి, గౌడ్‌ కోటాలో షాపులు దక్కించుకున్న వారిలో ముప్పావువంతు మంది అమ్మకానికి పెట్టి ఇప్పటికే ఆ షాపులను గుడ్‌విల్‌తో అమ్ముకున్నారు. పేరు వారిదే ఉన్నప్పటికి పెత్తనం అంతా పరాయి వ్యక్తులు చేసే విధంగా షాపులన్నీ చేతులు మారిపోతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వారు ఎక్కువమొత్తంలో చెల్లించి షాపులను కొనుగోలు చేస్తున్నారు. తుమ్మడం, దర్వేశిపురం, ఎస్‌ఎల్‌బిసి, హైదరాబాద్‌రోడ్డు, మిర్యాలగూడ, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, భువనగిరి, హాలియా ప్రాంతాల్లో ఎక్కువభాగం షాపులు ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతిలోకి మారిపోయాయి. 2లక్షల రూపాయలు తిరిగిరాని ఎమౌంట్‌తో షాపులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలు కళ్ళజూస్తూ షాపులను అమ్మజూపారు.

పలు ప్రాంతాల్లోని ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది వ్యాపారస్తులతో కుమ్మక్కై షాపులను మద్యవర్తిత్వం చేసి అమ్మిపెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులే డబ్బులకు కక్కుర్తిపడి షాపులను అమ్మిస్తుండడంతో ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ఆయా వర్గాలకు దూరమవుతుందన్నది స్పష్టమవుతుంది. ఏది ఏమైనా బహిరంగ మార్కెట్‌లో మద్యం షాపులు అమ్మకానికి ఉంచి విక్రయాలు జరిపి సొమ్ము చేసుకున్నట్లు బహిరంగంగానే ప్రచారం జరుగుతుండడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement