వానాకాలం సీజన్ వచ్చినా ఇంకా విపరీతమైన టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పెరగడంతో వడదెబ్బకు చాలామంది పిట్టల్లా ప్రాణాలు వదులుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఇవ్వాల (బుధవారం) ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న హీట్వేవ్ని ఎదుర్కోవటానికి సమగ్ర ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసినట్లు మంత్రి హరీవ్ ఈ సందర్భంగా తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగళ్ల వానల కారణంగా ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి ఏడు రాష్ట్రాల నుండి ఆరోగ్య మంత్రులు.. విపత్తు నిర్వహణ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
ఇక.. జిల్లా స్థాయిలోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి తగిన అవగాహణ కల్పించడం, వారి నైపుణ్యాలను మరింత పెంచేదుకు ప్రతి జిల్లాలో ఇద్దరు వైద్యాధికారులను నియమించినట్లు హరీశ్‌రావు ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCలు) సహా అన్ని ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణలో అంతరాయం లేని ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. హీట్వేవ్ని నివారించడానికి, వివిధ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, నిర్మాణ స్థలాలు, ఉపాధి హామీ పనుల స్థలాలలో తాగు నీటి సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు.
వేడి -సంబంధిత వ్యాధులతో ఆస్పత్రులకు వస్తున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక వార్డులు, ICU పడకలను కూడా ఏర్పాటు చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వాహనాల్లో అత్యవసరాలకు అవసరమైన మందులను అమర్చామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ORS ఇతర ముఖ్యమైన మందులను నిల్వ చేసినట్టు తెలిపారు.