తెలంగాణలో నిత్యం ఏదో చోట చిరుత పులులు తిరుగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి దగ్గర చిరుత సంచారం కనిపించింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ట్విట్టర్లో తెలియజేశారు. ‘‘ఈ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నా.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పచ్చదనంతో పాటు అడవుల విస్తీర్ణం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో వన్యప్రాణులు, మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.
ఇవ్వాల (శనివారం) మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి దగ్గరున్న కేసీఆర్ అర్బన్ పార్క్‌లోని గోల్‌బంగ్లా వాచ్ టవర్ వద్ద ఓ చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమమే దీనికి కారణం అని ఎంపీ సంతోష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్వీట్లో చిరుత సంచరిస్తున్న వీడియో, ఫొటోలను షేర్ చేశారు. సీఎం కేసీఆర్‌కు కుడోస్ అంటూ పేర్కొన్నారు.