Tuesday, November 26, 2024

Big Story: ఉచితాలు ఎప్పుడూ ఉచితం కాదు, ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఆర్థికవేత్త ఆషిమా

ఉచితాలు ఎప్పటికీ ఉచితాలు కావని ఆర్బీఐ మానిటరింగ్‌ పాలసీ కమిటీ సభ్యురాలు అషిమా గోయల్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏదో రూపంలో వాటికి మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఉచితాలపై హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలను, వాటి ప్రభావాలను కూడా ఓటర్లకు వివరించాలని ఆమో కోరారు. ఇలా చేస్తే ఉచిత హామీల విషయంలో పార్టీల మధ్య పోటీతత్వం తగ్గుతుందని చెప్పారు. ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఆ భారాన్ని మరోచోట మోపాల్సి వస్తుందన్నారు. ఇది ప్రజలకు చేసే సేవలపై ప్రభావం చూపుతుందన్నారు. ధరలను వక్రీకరించే సబ్సీడీలు ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.

ఉచితాల మూలంగా ఉత్పత్తిపై, వనరుల కేటాయింపుపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఇది పరోక్షంగా ఖర్చులు పెంచుతుందన్నారు. పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌ మూలంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయని ఆమె చెప్పారు. వీటి మూలంగా నాణ్యమైన విద్య, వైద్యం, గాలి, నీరు అందించలేమన్నారు. దీని వల్ల పేద ప్రజలే ఎక్కువ ప్రభావితం అవుతారని చెప్పారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉచితాల మూలంగా పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతుందన్నారు. వీటి మూలంగా దేశం స్వయం సంవృద్ధిని సాధించలేదన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రధాని కేవలం గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఉచిత విద్యుత్‌, మహిళలకు పెన్షన్‌ హామీలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఉచితాలను వ్యతిరేకిస్తు మాట్లాడారని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు సైతం దీనిపై అలిమికాని ఉచిత హామీలపై ప్రత్యేకంగా పరిశీలన జరపాలని కోరారు. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఆర్ధిక వ్యవస్థల వృద్ధిరేటు తగ్గుతున్న సమయంలో భారత్‌లో మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతుందన్నారు.

అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మన దేశం చాలా దేశాల కంటే మెరుగ్గా ఉందన్నారు. లాక్‌డౌన్‌ మూలంగా పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతిన్నప్పటికీ, దేశీయంగా ఉన్న డిమాండ్‌ మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ తట్టుకోకలిగినట్లు చెప్పారు. ఎగుమతులు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి మూలంగా ఆర్ధిక మాంధ్యం పరిస్థితులు మనపై అంతగా ప్రభావం చూపడంలేదన్నారు. ఆర్థిక సంస్కరణలే మన వృద్ధిరేటు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్థిక, ద్రవ్య విధానం సమన్వయంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫాలితాలు ఇస్తున్నట్లు తెలిపారు.

రెపోరేటు పెంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. వడ్డీ రేట్లు పెంచుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రలోకి రాకుంటే, అదే అతి పెద్ద సవాల్‌గా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల మూలంగా ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి వస్తున్న సూచనలు కనిస్తున్నాయని, అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 6 శాతం కంటే దిగువకు వచ్చే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాలు తగ్గుతున్నాయని, వృద్ధిరేటు పెరిగితే క్రమంగా అనుకున్న టార్గెట్‌ను సాధించవచ్చన్నారు. జూన్‌లో ద్రవ్యోల్బణం 7.01 శాతం ఉంటే, జులైలో అది 6.71 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. ఈ దిశగానే రెపోరేట్లను పెంచుతున్నారు. ఆర్బీఐ జోక్యం తరువాత రుపాయి క్షిణత కూడా ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే తక్కువగానే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement