తెలంగాణలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉచిత టీకాల పంపిణీపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 18-44 ఏళ్ల అర్హులందరికీ టీకాలను ఉచితంగా అందజేస్తామనీ, ఈ కేటగిరీల్లో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో టీకాలను కొనుగోలు చేస్తోందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 18 నుంచి 44 ఏళ్ల వయసు మధ్య కోటీ 80 లక్షల మంది ఉండగా.. రెండు డోసుల టీకాలు కలుపుకుని 3 కోట్ల 60 లక్షల టీకాలు అవసరం. అంత భారీగా టీకాలు సరఫరా అవుతాయా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ సరఫరా సాధ్యాసాధ్యాలపై ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
తెలంగాణలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే 37.58 లక్షల మందికి తొలిడోసును, 5.30 లక్షల మందికి రెండో డోసును పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా టీకాలను కేంద్రమే దశల వారీగా సరఫరా చేస్తోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులు రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరికి రెండు డోసులు వేయాలంటే మొత్తంగా 3.60 కోట్ల డోసుల టీకాలు కావాలి. వీరి కోసం కూడా అదనంగా ప్రభుత్వ వైద్యంలోనే మరో 1500 కేంద్రాలను కొత్తగా నెలకొల్పాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 2లక్షల మందికి టీకాలిచ్చినా.. నెలకు 60 లక్షల మందికి ఇవ్వగలుగుతారు. అలా 1.80 కోట్ల మందికి తొలిడోసు వేయడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అంటే మే, జూన్, జులై నెలాఖరు వరకూ తొలిడోసు టీకాలు అందజేస్తారు.
దేశంలో ప్రస్తుతం రెండు సంస్థలు కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణలోనే ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి అధిక కేటాయింపులు రాష్ట్రానికే ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థను ప్రభుత్వం కోరింది. అయితే అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేయాల్సి ఉండడంతో.. రాష్ట్రం వినతి మేరకు డోసులను సరఫరా చేస్తాయా? అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా, ప్రతినిధులతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఈ భేటీ నిర్వహించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ కు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ను కోరారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సినేషన్ కు తమ తోడ్పాటు ఉంటుందని, అందుకు అవసరమైన టీకా డోసులు అందజేస్తామని వెల్లడించారు. కరోనా టీకా డోసుల పంపిణీలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై మరోసారి ఉత్పత్తి సంస్థలతో ప్రత్యేకంగా సమావేశమవుతారనీ వైద్యఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అంచనాలకు తగ్గట్లుగా సరఫరా లేకపోతే.. 18-44 ఏళ్ల మధ్యవయస్కుల టీకాల ప్రక్రియ నిరంతరాయంగా నెలల తరబడి కొనసాగే అవకాశాలున్నాయని తెలిపాయి.