Wednesday, November 20, 2024

నిరుద్యోగ యువతకు మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచిత కోచింగ్‌: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతకు మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్నందున ఆయా సబ్జెక్టుల్లో నిపుణుల నియామకం, ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు. గ్రూప్‌ 1,2,3 పోస్టుల కోసం ఉమ్మడి పది జిల్లాలలోని మైనారిటీ సెంటర్లోనూ, అలాగే గ్రూప్‌ -4 పోస్టుల కోసం 33 జిల్లాల కేంద్రాలలో కోచింగ్‌ ఇవ్వల్సిందిగా ఆయన సూచించారు. రంజాన్‌ మాసం తర్వాత కోచింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన కోరారు.

సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల సమీక్ష జరిపారు. రాష్ట్రంలో 81 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో మైనారిటీ సంక్షేమ శాఖలో 76, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1445 ఖాళీలు ఉన్నట్లు మంత్రి కొప్పుల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖలో గ్రూప్‌ -1 కేటగిరిలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఆరు పోస్టులు ఉన్నాయని, అలాగే గ్రూప్‌ -2 కేటగిరిలో 10 సహాయ సంక్షేమాధికారి, 15 హౌస్‌ సంక్షేమాధికారి, 28 జూనియర్‌ అసిస్టెంట్లు , నాలుగు అకౌంటెంట్లు, ఉర్దూ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు.

మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో ఖాళీగా ఉన్న 1445 పోస్టులలో 594 టిజిటి, 414 జూనియర్‌ లెక్చరర్లు, 200 లైబ్రేరియన్లు, 127 స్టాఫ్‌ నర్సులు, 60 ఫిజికల్‌ డైరెక్టర్లు, 38 క్రాఫ్‌ టీచర్లు, 12 పిఇటి ఖాళీలు ఉన్నట్లు మంత్రి అధికారులు వివరించారు. గురుకుల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల మండలి (టిఆర్‌ఈఐబి) ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏ. కె. ఖాన్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌, మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నదీం అహ్మద్‌, డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం తదితర అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement