Friday, November 22, 2024

Fraud: కరెంట్​ బిల్లు కట్టలేదన్న మెస్సేజ్​.. గాబరాపడి లింక్​ ఓపెన్​ చేశారో బ్యాంకు ఖాతా ఖాళీ!

సైబర్​ మోసగాళ్లు దేన్నీ వదలట్లేదు. బ్యాంకు ఖాతా వివరాల నుంచి క్యూఆర్‌ కోడ్‌ల వరకు సమాచారం సేకరించి మోసాలకు తెగబడుతున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలోనూ కొత్త పోకడలు పోతున్నారు. ప్రజల సొమ్మును కాజేసేందుకు తమకు చేతనైన పద్ధతులన్నీ చేసేస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ ఉద్యోగులుగా నటిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య హైదరాబాద్​ సిటీలో జరిగిన మోసంపై పోలీసు అధికారులు వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు.

ముందు మొబైల్‌లో మెసేజ్​ పంపి..

సైబర్​ మోసగాళ్లకు చిక్కి చాలా మంది వినియోగదారులు తమ డబ్బును పోగొట్టుకున్న కొన్ని కేసులు ఇప్పటికే హైదరాబాద్​ సిటీలో నమోదయ్యాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు SMS లేదా వాట్సాప్ ద్వారా మెస్సేజ్​ పంపుతారు. దానికి స్పందించిన వారిని తమ టార్గెట్​గా ఎంచుకుంటారు. తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని.. వినియోగదారుడు కరెంటు బిల్లులు చెల్లించలేదని, ఆ తర్వాత పగలు లేదా రాత్రి వేళ ఎప్పుడైనా కరెంటు సరఫరా నిలిపివేస్తామని చెబుతారు. దీంతో ఆందోళన చెంది, గబరా పడ్డవారిని ట్రాప్​లోకి లాగుతారు. 

అయితే.. ఇక్కడే మోసగాళ్లు వినియోగదారులను మానసికంగా టార్గెట్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా ప్రజలు ఎవరు కాల్​ చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించరు, వారి పూర్వాపరాల గురించి తెలుసుకోరు. ఎందుకంటే విద్యుత్ సరఫరా డిస్‌కనెక్ట్ అవుతుంది అనగానే.. ఎదుర్కొనే సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇక.. అట్లాంటి కాల్‌లను సీరియస్‌గా తీసుకుంటారు. ఆ తర్వాత మోసగాళ్లు ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉంటారు” అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారి ఒకరు తెలిపారు.

ఒక మోసానికి సంబంధించి ఇట్లాగే జరిగిందని ఓ కేసు డేటా వివరాలను వెల్లడించారు పోలీసులు. “ ఓ బాధితురాలికి ముందు ఒక లింక్‌ను పంపి..  యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని చెప్పాడు. దీంతో క్విక్ సపోర్ట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి రూ. 30 లేదా రూ. 50 లావాదేవీ చేయమని కోరాడు. తక్కువ మొత్తమే కాబట్టి వారు పెద్దగా సందేహించలేదు. కానీ, ఆ తర్వాత మోసగాడు తిరిగి కాల్ చేస్తామని బాధితురాలికి చెప్పి అనుమానించని విధంగా ట్రాప్​లోకి తీసుకొచ్చాడు. అప్పటికే టెన్షన్​తో వెయిట్​ చేస్తున్న బాధితురాలిని మోసగాడు ఆమె బ్యాంక్ ఖాతాలోకి లాగిన్ అయ్యి ఆధారాలను యాక్సెస్ చేస్తాడు. ఇక  బ్యాంక్ ఖాతా నుండి డబ్బును మొత్తం లాగేశాడు” అని అధికారి వివరించారు.  ఇటీవల హైదరాబాద్​ సిటీకి చెందిన ఓ మహిళ ఈ తరహాలో మోసగాళ్ల చేతిలో రూ.8.5 లక్షలు పోగొట్టుకోగా, మరో బాధితుడు అదే విధంగా రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement