పెళ్లిళ్లలో చోరీలకు పాల్పడుతూ.. అమాయకులను మోసం చేస్తున్న నలుగురు మహిళా దొంగలతో పాటు వారికి సహకరిస్తున్న ఆటో రిక్షా డ్రైవర్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న కల్కాజీలోని డిడిఎ ఫ్లాట్‌ల సమీపంలో ముగ్గురు మహిళలతో కలిసి రిక్షా ఎక్కినప్పుడు తన బ్యాగ్ నుండి లక్ష రూపాయలు కొట్టేశారని మాయాదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ కేసులో నిందితులను మమత, వర్ష, సుష్మ, శ్వేత, ఆటో డ్రైవర్ దినేష్‌గా గుర్తించామని, వారి దగ్గర నుంచి లక్ష రూపాయల నగదు, ఆటో రిక్షా కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇవ్వాల తెలిపారు. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలో అమర్చిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుల జాడ కనిపెట్టారు. రిక్షాను అద్దెకు తీసుకుని.. నేరం చేసి అక్కడి నుంచి పారిపోయిన నలుగురు మహిళలను కూడా బాధితురాలు గుర్తించింది.
నిందితులను ఎలా కనిపెట్టారంటే..
ఆటో డ్రైవర్ దినేష్ ను సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు అతని ఇంటిపై దాడులు చేసి అరెస్టు చేశారు.. అతడిని విచారించగా మహిళా దొంగల ముఠా పెళ్లిళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఆ మహిళలు ముందుగా తాము అనుకున్నట్టుగా ఓ ప్రదేశంలో కలుసుకునేవారని.. ఒకరితో ఒకరు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారని దినేష్ చెప్పాడు. పోలీసు బృందం ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మాటు వేసి నలుగురు మహిళా దొంగలను అరెస్టు చేసింది. కాగా, వీరంతా మధ్యప్రదేశ్ నివాసితులుగా పోలీసులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం తాము ఢిల్లీకి వచ్చి పెళ్లిళ్లలో దొంగతనాలు చేసి అమాయకులను మోసం చేశామని నిందితులు పోలీసులకు తెలిపారు. డ్రైవర్ దినేష్ కూడా వారితో కుమ్మక్కయ్యాడు. అతని ఆటో రిక్షాను రోజూ రూ. 1500 చొప్పున కిరాయికి తీసుకుని ఢిల్లీలో చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు.
లక్ష రూపాయలు ఎలా కొట్టేశారంటే..
ఫిబ్రవరి 2వ తేదీన ఓ మహిళ బ్యాంకు నుంచి బయటకు వచ్చి బ్యాగ్‌లో కొంత డబ్బు పెట్టడాన్ని గమనించిన ముఠా ఆమెను టార్గెట్ చేసుకుంది. ఆటోను బ్యాంకు బయట పార్క్ చేయాలని ఆటో డ్రైవర్‌ను కోరారు. ముగ్గురు మహిళలు ఆటోలో ఆ మహిళతోపాటు వెళ్లగా వారిలో ఒకరు దినేష్ నడుపుతున్న రిక్షాలో అనుసరించాడు. సుష్మ, వర్ష బ్యాంకు నుంచి డ బ్బుతో వచ్చిన మహిళ ఫోన్ చాటింగ్‌లో నిమగ్నమై ఉండగా.. మమత తన బ్యాగ్‌లోని డబ్బును బ్లేడ్‌తో కత్తిరించి ఆటో దిగేసి వెళ్లారు. ఆ తర్వాత వారిని అనుసరించి వచ్చిన మరో ఆటోలో ఎక్కి పారిపోయారు.