నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోచంపాడ్ పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సురేష్(40), యోగేష్ (16), శ్రీనివాస్((40), సిద్దార్థ్ (16), శ్రీకర్ (14), రాజు(24). వీరంతా మాక్లూర్ మండలం దీకంపల్లి, గుత్ప, నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వారుగా గుర్తించారు. పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమంలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్నానానికి నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
పోచంపాడు పుష్కర ఘాట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మరణం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబ సబ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని మంత్రి కోరుకున్నారు