Friday, November 22, 2024

టీఎస్‌పీఎస్సీ పునఃప‌రీక్ష‌ల‌కు మ‌రో 4 నెల‌లు ఆగాల్సిందే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రద్దు చేసిన నాలుగు ఎంపిక పరీక్షలతోపాటు మిగిలిన మరో మూడు నియామకాలకు సంబంధించిన పరీక్షలను ఇప్పట్లో నిర్వహించడం కష్టసాధ్యమని తెలుస్తోంది. ప్రస్తుత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పాలక మండలి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో 7 పరీక్షలు నిర్వహించింది. గ్రూప్‌-1 ప్రిలిమనరీతోపాటు డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో పరీక్షలను నిర్వహించగా మరో మూడు పరీక్షలు జరపాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడడం, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తు చేసిన సిట్‌ నాలుగు ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు పొక్కినట్లు గుర్తించి ఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. దీంతో సర్వీసు కమిషన్‌ చేసేదేమీ లేక నాలుగు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్షా ప్రశ్నాపత్రాలు సైతం లీకయ్యాయని ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌ ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా..? లేదా..? అన్న అంశంపై నివేదిక ఇస్తే ఈ పరీక్షను కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పట్లో పరీక్ష జరిగేనా..?
రద్దైన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షతోపాటు మిగతా పరీక్షలను నిర్వహించాలంటే కనీసం మూడు నెలల వ్యవధి పడుతుందని టీఎస్‌పీఎస్సీవిశ్రాంత చైర్మన్లు, సభ్యులు చెబుతున్నారు. ప్రశ్నాపత్రాలను రూపొందించడానికే రెండు నెలల సమయం పడుతుందని, మళ్లి నోటిఫికేషన్‌ను జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు కనీసం నెల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ప్రశ్నల నిధి (క్వశ్చన్‌ బ్యాంక్‌) కూడా బయటకు వచ్చిందన్న ప్రచారం జరుగుతుండడంతో తాజాగా కమిషన్‌ మరో ప్రశ్నల నిధిని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు జరుగుతుండడం, వచ్చే రెండు మూడు నెలల్లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీసెట్‌తోపాటు జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలు జరుగుతుండడంతో మిగతా పోటీ పరీక్షలు, నియామక పరీక్షలకు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. మే నుంచి ఆగస్టు వరకు జాతీయస్థాయి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు. రద్దు అయిన గ్రూప్‌-1 ఎంపిక పరీక్షకు 2.63 లక్షల మంది హాజరుకాగా ఇందులో 50 వేల పైచిలుకు అభ్యర్థులు ప్రిలిమనరీ పరీక్షలో అర్హత సాధించారు. తాజాగా పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది కాలంలో ఈ నియామక పరీక్ష రాసేందుకు అర్హత సాధించని అభ్యర్థులు ఈ దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థుల సంఖ్య మరో 50 వేల నుంచి లక్ష వరకు పెరిగే అవకాశముందని కమిషన్‌ అంచనా వేస్తోంది. ఒకే రోజున ఇంత మంది అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండాలి. వివిధ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాలు నిర్ణయించడంతో రద్దు అయిన పరీక్షలతోపాటు వాయిదా పడిన మిగతా మూడు ఎంపిక పరీక్షలను నిర్వహించడానికి మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

తాజాగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దూకుడుగా వెళుతున్న సిట్‌ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదికను అందజేయడానికి మరో నెల సమయం పడుతుందని చెబుతున్నారు. లీకేజీలో నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న వారిని సోమవారం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. లీకేజీకి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో పూర్తి సమాచారం రాబట్టలేకపోయామని, మరో వారం రోజులపాటు నిందితులను తన కస్టడీకి ఇవ్వాలని సిట్‌ సోమవారం నాంపల్లి న్యాయస్థానం ఎదుట పిటిషన్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను తమకు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. వరుస ప్రవేశ పరీక్షలు, సిట్‌ విచారణ, ప్రశ్నాపత్రాల కూర్పు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సంబంధిత కారణాల నేపథ్యంలో రద్దు అయిన నాలుగు పరీక్షలను, ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన మరో మూడు పరీక్షల నిర్వహణ జూన్‌, జులై మాసాల్లోనే జరిగే అవకాశం ఉందని, అప్పటికీ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ పూర్తయి ఫలితాలు కూడా విడుదలవుతాయని చెబుతున్నారు.


విధుల్లో చేరిన అభ్యర్థులు…
గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షతోపాటు ఇంకా మూడు ఎంపిక పరీక్షలు రద్దు కావడంతో ఈ పరీక్షకు సిద్దమైన అభ్యర్థులు తిరిగి విధుల్లో చేరి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌1 ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించి ఉద్యోగాలను సాధించాలన్న పట్టుదలతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, ప్రయివేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు లక్ష మందికిపైగా కోచింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లిపోయి విధుల్లో చేరినట్లు సమాచారం. ఇందులో చాలా మంది ఇప్పటికే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా మరికొంత మంది దీర్ఘకాలం సెలవుకు దరఖాస్తు చేసి శిక్షణ పొందినట్లు చెబుతున్నారు. నోటిఫికేషన్‌ మళ్లిd జారీ అయ్యాక శిక్షణ పొందాలన్న నిర్ణయానికి ఆ అభ్యర్థులు వచ్చినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement