ఒకే ఫ్యామిలీలోని నలుగురిని అత్యంత దారుణంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ లో జరిగింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ల అమ్మాయి, పదేళ్ల అబ్బాయి కూడా ఉన్నారు. హత్యకు ముందు ఆ బాలికపై దుండగులు మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని దళిత ఫ్యామిలీగా గుర్తించారు.
మృతుల బంధువులు చెప్పిన వివరాల ప్రకారం 11 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, హత్య కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితుల ఒంటిపై అత్యంత తీవ్రమైన గాయాలున్నాయన్నారు. అమ్మాయి మృతదేహం గదిలో కనిపించిందని, మిగతా ముగ్గురి మృతదేహాలు పెరట్లో పడేశారని చెప్పారు.
2019 నుంచి ఓ అగ్రకులానికి చెందిన కుటుంబంతో భూ తగాదాలు నడుస్తున్నాయని, సెప్టెంబర్ లో ఒకసారి ఆ కుటుంబం వారు దాడికి పాల్పడ్డారని, వారే ఈ హత్యలు చేసి ఉండొచ్చని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, కేసుపై రాజీ కుదిర్చేందుకు పోలీసులు బలవంతం చేస్తున్నారని, నిందితుల ఇంటికి పోలీసులు వెళ్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ లో దాడికి సంబంధించి ఫిర్యాదు చేస్తే వారం తర్వాతే కేసు నమోదు చేశారన్నారు.