Tuesday, November 19, 2024

రేవంత్‌రెడ్డికి పెరుగుతున్న బలం.. కొండా మద్దతు కూడా ఆయనకే

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి క్రమంగా పార్టీ సీనియర్ నేతలను ఒక్కటి చేస్తోన్నారు. తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోన్నారు. తనకు అండగా నిలిచేలా మలచుకొంటోన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన తనకు రాష్ట్ర స్థాయిలో పార్టీపరంగా అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టడం వల్ల సీనియర్ నేతల్లో నెలకొన్న అసమ్మతిని, అసంతృప్తిని చల్లార్చడంలో సక్సెస్ అవుతోన్నట్టే కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖ.. రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత- బీసీ మహిళకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఒకదశలో కొండా సురేఖ పేరును కూడా పరిశీనలోకి తీసుకున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. దీనితో ఆమె కూడా ఈ పదవిపై ఆశలు పెంచుకున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాం నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చిన కొండా సురేఖ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్‌ పార్టీలలో చేరినప్పటికీ.. మళ్లీ సొంతగూటికే వచ్చారు. తాజా పరిణామాలతో రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని కొండా సురేఖ స్వాగతించినట్టే. ఈ కారణంతోనే ఆమె ఆయన నివాసానికి వెళ్లి మరీ.. శుభాకాంక్షలు తెలిపారు. ఓ మొక్కను ఇచ్చి గ్రీటింగ్స్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో కురువృద్ధుడిగా గుర్తింపు పొందిన వీహెచ్‌ను రేవంత్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పలకరించారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి ఉండటం.. రేవంత్ నాయకత్వం పట్ల ఆయన సానుకూలతను వ్యక్తం చేసినట్టే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి అసమ్మతులను రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి, సీతక్క బలపరుస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement